కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లివ్వండి – టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
వరంగల్, డిసెంబర్ 3 (జనంసాక్షి) :
కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. కాకతీయు వైభవానికి ప్రతీకైన రామప్ప దేవయాలన్ని ఆయన సోమవారం సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడంలో ప్రభుత్వం ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. కాకతీయులు పాలించిన ప్రాంతంలోని ఎంతో విలువైన శిల్ప కట్టడాలు, చెరువులను పరిరక్షించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కేవలం రూ.25 లక్షలు కేటాయించారని, అంటే వారికి ప్రభుత్వంలో ఉన్న గుర్తింపెంటో అర్థమవుతుందన్నారు. తాము భిక్షాటన చేసి పోగు చేసిన డబ్బులతో ఉత్సవాలు ప్రభుత్వం తలపెట్టిన దానికంటే ఘనంగా నిర్వహించి చూపిస్తామన్నారు. తెలంగాణలోని శిల్ప సంపదను, తాగు, సాగునీటి వనరులను పాలకులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాకతీయుల పురాతన కట్టడాలలో నైపుణ్యం, శక్తి మహా అద్భుతంగా ఉన్నాయన్నారు. 30 యేళ్లుగా రామప్పను చూస్తున్నానని అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. ఆలయం శిథిలమవుతున్నా పరిక్షణ చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. భవిష్యత్ తరాలకు కాకతీయుల చరిత్రను సజీవంగా చాటిచెప్పేందుకు ఆలయాలను పరిరక్షిస్తామని తెలిపారు. అధికారం కోసమే చంద్రబాబు, షర్మిల పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్‌లో జగన్‌ను తరిమికొట్టిన విధంగానే వారిని తరుముతామన్నారు.