కాకినాడ పోర్టులో కుప్పకూలిన భారీక్రేన్లు

– ఒకరు దుర్మరణం
కాకినాడ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఓడ రేవులో రెండు భారీ క్రేన్లు కుప్పకూలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 10 మందికి గాయపడ్డారు. కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఓడల నుంచి సరకు కిందకు
దించేందుకు ఈ ఆఫ్‌షోర్‌ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వట్టిపల్లి లక్ష్మణ్‌ కుమార్‌ (35)గా గుర్తించారు. మృతుడు లక్ష్మణ్‌కుమార్‌ పోర్టులో కార్మికుడిగా పనిచేస్తోన్నాడు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు పోతిలేడి ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వైద్యం కోసం కాకినాడ హాస్పిటల్‌కు తరలించారు. ఇటీవల సంభవించిన పెథాయ్‌ తుపాను కారణంగా ఈ క్రేన్లు దెబ్బతినడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు.  ఈ సమయంలోనే పాత క్రేన్‌ కుప్పకూలి కొత్త క్రేన్‌పై పడటంతో ప్రమాదం జరిగింది. మరమ్మత్తులు చేస్తుండగా భారీ క్రేన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద నుంచి ఐదుగురు కార్మికులను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రదేశంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.