కాపు రిజర్వేషన్లపై త్వరలోనే జీవో..

– దీనిపై అసెంబ్లీలో కూడా చర్చిస్తాం
– కాపు రిజర్వేషన్‌లపై వైసీపీ దొంగనాటకాలాడుతుంది
– ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు
అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : కాపు రిజర్వేషన్లపై త్వరలోనే జీవో తెస్తామని తెలిపారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..  కేబినెట్‌లో కాపుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. ఎన్నో పార్టీలు హావిూలు ఇచ్చినా అమలు చేయలేదని, మోసం చేశాయని అన్నారు. కాపు రిజర్వేషన్లు అసెంబ్లీ తీర్మానం చేశామని, కాపులకు ఉపముఖ్యమంత్రి, కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి చంద్రబాబు కాపులకు మేలు చేశారని గుర్తుచేశారు. బీసీల్లో చేర్చే పక్రియకు మంజునాథ్‌ కమిషన్‌ రిపోర్ట్‌ ను కేంద్రానికి పంపామని వెల్లడించారు.
కేంద్రం కాపు రిజర్వేషన్లు పక్కన పెట్టిందని గంటా మండిపడ్డారు. 10శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకు ఇస్తామని.. త్వరలోనే జీవో ఇస్తామని… దీనిపై అసెంబ్లీలో కూడా చర్చిస్తామని తెలిపారు. వైసీపీ దొంగ నాటకాలు ఆడుతోందని గంటా మండిపడ్డారు. కేంద్రం పరిధిలోనిదని చెప్పి తప్పుకుంటున్నారని విమర్శించిన ఆయన.. ఏ వర్గానికి నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖలో రీజినల్‌ కాపు భవన్‌ కు వారంలో శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. మరో ఐదు ఇతర జిల్లాల్లో భవనాలు నిర్మాణంలో ఉన్నాయని గంటా పేర్కొన్నారు.