కాబూల్‌ ఉగ్రదాడిలో 12 మంది మృతి

25BRK-69

కాబూల్‌: ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతుల్లో ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు భద్రతా సిబ్బంది, ముగ్గురు పోలీసులు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 35 మంది విద్యార్థులు, 9 తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు. తరగతి గదుల్లో చిక్కుకున్న 750 మంది విద్యార్థులను, ప్రొఫెసర్లను ఎట్టకేలకు భద్రతా బలగాలు కాపాడాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. 2006లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో 1700కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవలే అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన ఈ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఇద్దరు అపహరణకు గురయ్యారు. సంక్షుభిత అఫ్గాన్‌లో వరుసగా విదేశీయుల అపహరణలు చోటు చేసుకుంటున్నాయి. కాబూల్‌లో నేరగాళ్ల ముఠాలు కూడా విదేశీయులు లక్ష్యంగా డబ్బుల కోసం అపహరణలకు పాల్పడుతున్నాయి.