కార్ణటక మోడల్‌పై దుష్ప్రచారం వద్దు

` బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు
` రాష్ట్రానికి అప్పులు తప్ప హామీలన్నీ విస్మరించారు
` కర్నాటకపై సందేహాలుంటే లగ్జరీ బస్సుల్లో తీసుకెళ్తాం
` కాంగ్రెస్‌ స్థాపించిన సంస్థలతోనే ఎన్నో ఉద్యోగాలొచ్చాయ్‌..
` ఆరు గ్యారెంటీ కార్డులతో ముందుకు వచ్చాం.. ఆశీర్వదించండి
` సంగారెడ్డి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
` ఐదు గ్యారంటీల అమలు చూద్దాం.. ఎక్కడికి రావాలి? : రేవంత్‌ రెడ్డిసంగారెడ్డి, అక్టోబర్‌ 29 (జనంసాక్షి):పేద ప్రజలకు బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిందేమీ లేదని, అప్పులు తప్ప హామీలు అమలుచేసిన పాపాన పోలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కర్ణాటకలో హామీల అమలుల్లో సందేహాలుంటే వచ్చి చూసుకోండి.. లగ్జరీ బస్సులో తీసుకెళ్లి చూపిస్తామని సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ఆదివారం కాంగ్రెస్‌ విజయభేరీ బస్సు యాత్ర సంగారెడ్డిలోని గంజ్‌ మైదానానికి చేరుకున్న సందర్భంగా మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘సోనియాగాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సమాధి అవుతున్నా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ వెనక్కి తగ్గలేదు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆన్నీ హామీలు చేస్తున్నాం. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, మంత్రులు మభ్యపెడుతున్నారు. బీఆర్‌ఎస్‌..బీజేపీ రెండూ ఒక్కటే.. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీటీమ్‌గా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినట్లుగానే సీఎం కేసీఆర్‌ కూడా గతంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయి. ఇవి ఓట్ల కోసం ఇస్తున్న హామీలు కావని, పేదల బతుకుల్లో బాగు కోసం ఇస్తున్న గ్యారంటీలుగా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియాగాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్‌, అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయి ఇప్పుడు విమర్శిస్తున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందన్నారు.
అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…
తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రమని, తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో అప్పులపాలు అయిందన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పుల వల్ల ప్రతి ఒక్కరిపై రూ. 1.50 లక్షల అప్పు పెట్టారన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందని, ఫలితంగా ఎన్నో ఉద్యోగాలు వచ్చాయన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని మాటిచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ. 500 బోనస్‌?ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. ప్రాణత్యాగం చేసింది కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ నేతలేనని ఈ సందర్భంగా ఖర్గే అన్నారు.
నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు : రేవంత్‌ రెడ్డి
రేవంత్‌ రెడ్డిని కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైరయ్యారు. బస్సు రెడీగా ఉంది.. ప్రగతి భవన్‌కు రావాలో.. ఫామ్‌ హౌస్‌కు రావాలో చెప్పండి.. కర్నాటక వెళ్లి ఐదు గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో చూద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కర్నాటకు వచ్చి చూడాలని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ విసిరిన సవాల్‌కు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకుని అటునుంచి కర్ణాటక వెళదామని కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఈ సవాలుకు మీరు సిద్ధమా? అని అడిగారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. మైనంపల్లి రోహిత్‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుందన్నారు. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్‌ పేద ప్రజలకు సేవ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నేతలు దామోదర్‌ రాజనర్సింహ, హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, జట్టి కుసుంకుమార్‌, నాయకులు తోపాజి అనంత కిషన్‌, ఆంజనేయులు, రామ్‌ రెడ్డి, రఘురాం, బుచ్చి రాములు, కిషన్‌, ప్రదీప్‌, శ్రీధర్‌ రాష్ట్ర, మండల, గ్రామ నాయకులతోపాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.