కార్తీక పున్నమి వేడుకలకు ఆలయాలు సిద్ధం
కరీంనగర్, నవంబర్ 27 జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రలైన ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో కార్తీక పున్నమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గోదావరి నదిలో స్నానం ఆచరించే భక్తులు లోతుకు దిగకుండా భారీ కేడ్లను నియమించారు. వాటిని దాటి వెళ్లకుండా స్నానాలు చేయాలని అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. మంగళవారం నుండే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. బుధవారం కూడా మహిళలు వేల సంఖ్యలో గోదావరిలో స్నానం ఆచరించి భక్తిప్రవత్తులతో కార్తీక దీపాలు వెలిగిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఆలయాల్లో చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు బ్రాహ్మణులకు దీపదానాలు సమర్పించేందుకు కూడా చక్కని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు పౌర్ణమికి ఆలయాలను దర్శించుకోవచ్చని భావిస్తున్నారు.