కార్మిక చట్టాలను తుంగలో తొక్కొద్దు
కనీస వేతనాలు చెల్లించి గౌరవించాలి: సిపిఎం
గుంటూరు,సెప్టెంబర్1(జనం సాక్షి): పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. 8గంటల పని విధానాన్ని తుంగలో తొక్కి యాజమాన్యాల ఇష్టానుసారంగా పని చేసే విధంగా చట్టాల్లో మార్పులు తెస్తున్నారన్నారు. కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో 94శాతంమంది అసంఘటితరంగ కార్యికులున్నారని, వీరికి కనీస వేతనాలు, పని భద్రత, పియఫ్, ఇయస్‌ఐ వంటి సౌకర్యాలేవీ అమలు కావట్లేదన్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ. 18 వేల కనీస వేతనాలివ్వాలనే కార్మిక సంఘాల డిమాండ్ చాలా న్యాయమైందన్నారు. కేంద్రంలోని బిజెపి బడా పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చటానికి కార్మిక చట్టాల్లో మార్పుల చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన రోడ్డు రవాణ బిల్లు, రవాణ రంగాన్ని, ఆర్‌టిసిని కనుమరుగు చేసే విధంగా ఉందన్నారు.ఇకపోతే ఆయా ప్రాంతాలలో వ్యాధులను అరికట్టేందుకు మెడికల్ క్యాంప్‌లను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, మంచినీటిని క్లోరినేషన్ చేయాలని అన్నారు. మురుగునీటి ప్రాంతాల్లో కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ తగిన మందులు సమకూర్చుకొని విషజ్వరాల నివారణకు పూనుకొవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రధాన పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యానికి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలన్నారు.