కాలుష్యంపై పోరాటమే అగర్వాల్‌కు నివాళి

ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ముందుకు సాగాలి
న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): గంగా కాలుష్య విముక్తి కోసం పోరాడిన యోధుడు ప్రొఫెసర్‌ అగర్వాల్‌ మృతి నిజంగా మనకు తీరని లోటు. ఆయన సంకల్సం గొప్పది. మనం ఎంతగానో పూజించే మన గంగ కాలుష్యం బారిన పడిన తీరును చూసి తట్టుకోలేక దీక్షద్వారా ప్రభుత్వాన్ని కదిలిద్దామని చేసిన సంకల్పం నెరవేరకుండానే కన్ను మూయడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగానే చూడాలి. ప్రధాని మోడీ కూడా గతపాలకులకు భిన్నంగా ఏవిూ వ్యవహరించడం లేదనీ ఈ దృష్టాంతం నిరూపించింది.  ప్రభుత్వాల చర్యలన్నీ కార్పొరేట్‌ సంస్థల పక్షానేనని అనతికాలంలోనే ఆయన గ్రహించారు. కాన్పూర్‌ ఐఐటీలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా, వివిధ యూనివర్సిటీల్లో పర్యావరణ పరిరక్షణను బోధించిన అధ్యాపకుడిగా ఆయన గంగ గురించి నెత్తీనోరూ మొత్తుకున్నా ప్రభుత్వంలో చలనం తీసుకుని రాలేకపోయారు. మనజీవితాలతో తరతరాలుగా పెనవేసుకున్న గంగ కాలుష్యం గురించి ఆయన ఎంతగానో ఆవేదన చెందారు. ఆయనకిది వ్యక్తిగతంగా ముడివేసుకు న్నందునే దశాబ్దాలుగా ఎంతో శక్తిమంతంగా పోరాడగలిగారు. విదేశీ డిగ్రీలు ఉన్న ఆయనకు రిటైరయ్యాక
లక్షలు సంపాదించడానికి ఆస్కారం ఉంది.  కానీ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతతో పాటు దేశజనాభాలో నలభైశాతం మంది నీటి అవసరాలను తీరుస్తున్న గంగను ఆయన కన్నుమూసేలోగా కాలుష్య రహితంగా మార్చాలనుకున్నారు. దశాబ్దకాలంగా ఆయన చేస్తున్న పోరాటం ఫలితంగా, నాలుగైదుసార్లు ఇలాగే ఆమరణదీక్షకు దిగినందున నాటి యూపీఏ ప్రభుత్వం గంగానది ఉపనదులపై నిర్మాణంలో ఉన్న కొన్ని జలవిద్యుత్‌ ప్రాజెక్టులను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. ఓ రకంగా ఇది ఆయనలో ఆత్మస్థయిర్యాన్ని నింపింది. ఆ తరువాత నాలుగేళ్ళలోనే వాటిలో కొన్ని తిరిగి ప్రాణం పోసుకోవడం అగర్వాల్‌ను ఎంతో బాధించింది. అగర్వాల్‌కు గంగను రక్షించడం ఒక్కటే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేశారు. అయితే పారిశ్రామకవేత్తల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వాలకు గంగ కాలుష్యం పెద్దదిగా కనిపించలేదు. తన ఆమరణదీక్షకు ముందు ప్రొఫెసర్‌ అగర్వాల్‌ ప్రభుత్వానికి తన నాలుగు డిమాండ్లను వివరిస్తూ రాసిన లేఖలకు ప్రధానమంత్రి కార్యాలయం కనీసం జవాబులు ఇవ్వలేదు. గంగ పరిరక్షణకోసం గత ప్రభుత్వాలు  ప్రకటించిన విధానాలు, ప్రాజెక్టుల పేర్లు మార్చడం వినా మోదీ ప్రభుత్వం కొత్తగా చేసిందేవిూ లేదన్నదని అగర్వాల్‌ ఆవేదన చెందారు. గంగను పునరుద్ధరించడమంటే దానిని శుభ్రం చేయడం ఒక్కటే కాదనీ, ఎక్కడికక్కడ దానిని నిలువరిస్తున్న అడ్డుగోడలనూ, ఆక్రమణలను ఛేదించి దానిని స్వేచ్ఛగా ప్రవహించనీయడం కూడా అని అగర్వాల్‌ చెప్పేవారు. అంటే అడ్డుగోడ కారణంగా అది కలుషితం కూడా అవుతోంది. పర్యావరణ ముప్పకు హేతువుగా మారుతోంది. మోదీ ప్రభుత్వం గంగకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రకటించి, తన మంత్రిత్వశాఖ పేరు కూడా మార్చింది. నాలుగేళ్ళక్రితం నమామి గంగ ప్రాజెక్టును 20వేల కోట్లతో ఆరంభించి, వచ్చే ఏడాదికల్లా దానిని పూర్తిగా ప్రక్షాళించాలన్న లక్ష్యం ఉన్నట్లు తెలిపింది. గంగా ప్రక్షాళనను సాధ్వి ఉమాభారతికి అప్పగించినా ఆమె కూడా ఏవిూ చేయలేకపోయారు. 2020కల్లా గంగా కాలుష్య నివారణ  జరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులను పరిశీలిస్తే ఇప్పట్లో అసాధ్యమన్న విషయం తేలిపోయింది. గంగను పునరుద్ధరించడం ఒక బృహత్తరమైన కార్యక్రమం కావచ్చును కానీ, ఇందుకోసం అగర్వాల్‌ ప్రతిపాదిస్తున్న మార్గాల్లో కొన్నింటినైనా అనుసరించడం ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు. అగర్వాల్‌ మరణం మోదీ ప్రభుత్వానికి మాయనిమచ్చగా మిగిలిపోనుంది. పర్యావణ ఉద్యమకారులకు మాత్రం అదొక స్ఫూర్తిగా నిలవనుంది. ఎవరికి వారు కాలుష్య కాసారాలను రక్షించడం లక్ష్యంగా పనిచేస్తే ఆయనకు నివాళి అర్పించిన వారం అవుతాం.