కాళేశ్వరం భూసేకరణపై సుప్రీం షాక్‌

యధాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం

న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ లేకుండా తెలంగాణ సర్కార్‌ నిర్మిస్తోందంటూ ఓ పిటిషన్‌ దాఖలు అయ్యింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అని సర్కార్‌ను కోర్టు ప్రశ్నించింది.. మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆపై తదుపరి విచారణను నాలుగు వారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజ భూసేకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. యదాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23న చేపట్టనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. జస్టిస్‌ ఎఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జెబి పర్దివాలా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆగస్టు 23 లోపు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని, దానికి పిటిషనర్లు రిజాయిండర్‌ కూడా దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజక్టు పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై బాధితులు 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు పిటిషన్లు కలిపి ఈనెల 22న సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.