కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
కాశ్మీర్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా బొనియార్‌ పట్టణంలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి నాలుగు ఏకే-47 రైఫిల్స్‌ సహా భారీ సంఖ్యలో ఆయుధాలు కలిగిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి బొనియార్‌ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు చొరబాట్లకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు తెలపడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ దళాలు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల చేతిలో హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. వారు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులనేది ఇంకా తెలియరాలేదని ఆర్మీ అధికారప్రతినిధి వెల్లడించారు. శ్రీనగర్‌లోని ఫతేకడల్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన రెండోరోజునే తాజా ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాల్పుల్లో ఓ జవాన్‌ సైతం అమరుడయ్యాడు. మరోవైపు గురువారం రాత్రి పుల్వామాలో ఉగ్రవాదులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. పుల్వామాలో సైన్యం సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఘటన సంభవించింది.