కిషన్‌ రెడ్డిది ఫెయిల్యూర్‌ యాత్ర


పర్యాటక మంత్రిగా రూపాయి తెచ్చారా
విమర్శలు కట్టిపెట్టాలని మంత్రి ఎర్రబెల్లి హితవు
హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్‌ యాత్ర అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో టూరిజంకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. గిరిజన యూనివర్శిటీ కోసం ములుగులో స్థలం కేటాయించామని.. దానికి ఇప్పటివరకు కేంద్రం రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. విభజన చట్టంలోని ఒక్క హావిూని కూడా కేంద్రం అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రజాఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం కిషన్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, తొర్రూరుల్లో, తర్వాత వరంగల్‌, వర్ధన్నపేట, జనగామలో యాత్ర సాగింది. శుక్రవారం రాత్రి హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల నుంచి కమలాపూర్‌ వరకు యాత్ర నిర్వహించారు. ఆయాచోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విమర్శలు చేశారు. దీనిపై మంత్రి మండిపడ్డారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి అయినా.. తెలంగాణకు ఒరిగిందేవిూ లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి హుందాగా ఉండాలని.. చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు.పిచ్చి.. పిచ్చి మాటలు మాట్లాడే బండి సంజయ్‌ పరువు తీసుకున్నారన్నారు. ఇకనైనా కిషన్‌రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు ఆపేయాలన్నారు. మిషన్‌ భగీరథను మెచ్చుకున్నారు కానీ.. పైసా కూడా ఇవ్వాలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌
ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన, వారసత్వాల గురించి బీజేపీ మాట్లాడితే నవ్వొస్తోందన్నారు. బీజేపీ సీనియర్‌ నేతల కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం పదవుల్లో ఉన్నారని తెలిపారు. బీజేపీ అంటేనే అమ్మకం, టీఆర్‌ఎస్‌ అంటే నమ్మకం అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశాన్ని హోల్‌ సేల్‌గా అమ్మేస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సంపద సృష్టించి పేదలకు పంచుతోందని ఎమ్మెల్యే బాల్కసుమన్‌ పేర్కొన్నారు.