కుంటుపడుతున్న విద్యా వ్యవస్థ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యా వ్యవస్థ దారి తప్పుతోంది. ప్రాథమిక విద్యా స్థాయిలో పర్యవేక్షించడానికి విద్యాధికారులు లేక విద్య  కుంటుపడుతోంది. అనేక సంవత్సరాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇన్‌ఛార్జీలతోనే వ్యవస్థ అంతా నడుస్తోంది. జిల్లాలోని 52 మండలాలకు గాను, నలుగురే పూర్తి స్థాయి మండల విద్యాధికారులుగా కొనసాగుతూ, మిగతా మండలాలకు ప్రధానోపాధ్యాయులను ఇన్‌చార్జీలుగా నియమించడంతో జోడు బాధ్యతలను నిర్వహించడంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది. దీనికి తోడు ఏజెన్సీ ప్రాంతంలోని జిల్లా విద్యాధికారి పోస్టు, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఉప విద్యాధికారుల పోస్టులు, రాజీవ్‌ విద్యామిషన్‌ టివో పోస్టు ఖాళీగా ఉండడంతో జిల్లాలో విద్యా వ్యవస్థ దారి తప్పింది. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం ఈ పోస్టుల ఖాళీలతో నీరుగారిపోతోంది. పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల పనితీరును ఇన్‌ఛార్జీలు పర్యవేక్షించకపోవడంతో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు, విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఆయా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించిన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి చలనం లేదు. భౌగోళికంగా జిల్లా పెద్దది కావడం, మారుమూల గ్రామాల్లో బస్సు సౌకర్యాలు లేక పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని  తెలుసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం సంఘాలను సంప్రదించకుండా, మేధావులతో చర్చించకుండా హడావిడిగా పథకాలను ప్రవేశపెట్టడం అవి నీరుగారిపోవడం అనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం విద్యావ్యవస్థలో ప్రయోగాలు చేయడం మూలంగా విద్యార్థులు చదువులు ముందుకు సాగక,  ఉపాధ్యాయులు, అటూ ఇన్‌ఛార్జీ అధికారులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా వెనుకబడిన జిల్లా అయినా ఆదిలాబాద్‌లో విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యావ్యవస్థను దారిలోకి తెచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.