కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియా

సియోల్: జగడాలమారి ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా మరోసారి అణుపరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్టు తమకు సంకేతాలు అందినట్టు దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యున్ హై చెప్పారు. ఉత్తరకొరియా అణుపరీక్షల ఏర్పాట్ల నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని మిలటరీని ఆదేశించారు.

గత జనవరిలో ఉత్తరకొరియా నాలుగో అణుపరీక్ష నిర్వహించింది. ఫిబ్రవరిలో ఒక ఉపగ్రహాన్ని బాలిస్టిక్ మిస్సైల్ సాంకేతికతతో లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టామని ప్రకటించింది. తాజాగా మరో అణుపరీక్ష  చేసేందుకు ప్రయత్నిస్తోందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఉత్తర కొరియా చర్యలను గతంలో ఐక్యరాజ్య సమితి, నాటో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సారి ఈ దేశంపై కఠిన ఆంక్షలు విధించే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని  దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ అన్నారు. ఉత్తర కొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించనున్నట్టు ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.