కూటమి నేతలకు ఓటమి భయం
సీట్లను కూడా పంచుకోలేని దుస్థితిలో నేతలు: జూపల్లి
మహబూబ్‌నగర్,నవంబర్10(జనంసాక్షి): మహాకూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల గలాటా చూస్తుంటే సీట్లను కూడా పంచుకునే స్థితిలో కూటమి నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీసం అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో పార్టీలు ఉన్నాయని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రజల స్పందన చూస్తుంటే టీఆర్‌ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని తెలుస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలను ప్రవేశ పెట్టలేదన్నారు. రైతుల కోసం ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను కేసీఆర్ తీసుకున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు ఉండదని.. చీకట్లు తప్పవని
భయ పెట్టిన వారు ఇప్పుడు చీకట్లో కలసి పోయారన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచితంగా కరెంటు ఇస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. ప్రతిపక్షాల నాయకులు మంచీ చెడులు ఆలోచించకుండా ప్రజలకు మేలు జరుగుతున్న పథకాలపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు మంచి పేరు రాకుండా ఉండేందుకు కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒక్కటయ్యారన్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు.ఆసరా పింఛన్ల పై వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. పింఛన్లను రూ. 2016కు పెంచుతామని అన్నారు. కేసీఆర్ కిట్ పథకాలను ప్రవేశ పెట్టి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మ్యానిఫెస్టోలో లేకున్నా పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ అమలు చేశామన్నారు.