కూటమి సీట్లపై తొలగని సందిగ్ధత

కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): మహాకూటమిలో జిల్లా నుంచి ఎవరు పోటీ చేస్తారన్న స్పషట్త ఇంకా రావడం లేదు. దీనిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. సిపిఐ. టిజెఎస్‌, టిడిపిలకు ఏయే స్థానాలు వెళతాయన్నది తేలాల్సి ఉంది. సింగరేణి కార్మిక ప్రాంతంలో ఏఐటీయూసీ బలంగా ఉండటంతో గెలుపునకు కలిసొచ్చే అంశంగా భావించిన సీపీఐ నేతలు ఈ స్థానాన్ని అడుగుతున్నారు. బెల్లంపల్లిపై పట్టుబడుతూనే అవకాశం ఉంటే చెన్నూరు స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన సొంత జిల్లా అయిన మంచిర్యాల జనరల్‌ స్థానంతో పాటు ఆసిఫాబాద్‌ నియోజవర్గాల్లో పోటీచేసేందుకు తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు కోదండరాం ప్రతిపాదిస్తున్నారు. పొత్తు త్వరగా తేల్చకుంటే 20స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పిన వాటిలో ఆసిఫాబాద్‌ కూడా ఉంది. ఆ పార్టీలో చేరిన కొట్నాక్‌ విజయ్‌కు టికెట్‌ ఇస్తానని స్వయంగా కోదండరాం ప్రకటించారు. కాంగ్రెస్‌ మాత్రం ఈ స్థానాన్ని వదులు కోవడానికి సుముఖంగా లేదు. ఆ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్న ఒకే ఒక్కడు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలో దించాలని పార్టీ యోచిస్తోంది. ఇక కోదండరాం పోటీ చేస్తారా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొనగా మంచిర్యాల స్థానం నుంచి పోటీ చేయించేలా తెజస సీనియర్లు ఒత్తిడి పెంచినట్లు సమాచారం. కోదండరాం పోటీపై మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే.. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలు ఇప్పటికే అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మంచిర్యాల అభ్యర్థిత్వం పార్టీ తనకే ఇస్తుందని అరవిందరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొత్తుల్లో ఈ కాంగ్రెస్‌ సీటు కోల్పోతే తిరుగుబాటు అభ్యర్థులుగా వీరు రంగంలోకి దిగే అవకాశం ఉంది. త్వరగా సీట్ల పంచాయితీ తేలకపోవడంతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమకే మంచి జరగగలదన్న భావనలో ఉన్నారు.