కూలిన ఇంటిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

పాడుబడ్డ ఇళ్లను కూల్చేయాలని సూచన
బాదఙ కుటుంబానికి మంత్రి పరామర్శ

వరంగల్‌,జూలై23(జనంసాక్షి): వరంగల్‌ నగరంలోని మండిబజార్‌లో వర్షాల కారణంగా నేలమట్టమైన ఇంటిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ… వరంగల్‌లో 379 ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చామని.. వాటిలో ఇప్పటికే 145 పురాతన ఇండ్లు కూల్చేశామని తెలిపారు. నోటిసులు అందుకున్న యజమానులు వారే ఇండ్లను తొలగించుకోవాలని… లేకపోతే జీడబ్ల్యూఎంసీ అధికారులే తొలగిస్తారని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇలాంటి సమయంలో సెల్ఫీల కోసం, చేపల కోసం వెళ్లి ప్రాణాల విూదతెచ్చుకోవద్దన్నారు. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నివిధాలుగా ఆదుకుంటారని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. ఉదయం మండిబజార్‌లో పాతభవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఫిరోజ్‌ అనే యువకుడికి శనివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అంతలోనే పెను విషాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన సమక్క అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత కుటుంబాన్ని
మంత్రి పరామర్శించారు.