కృష్ణమ్మకు జలకళ వచ్చేనా?

పూర్తిస్థాయి నీటిమట్టం వస్తుందని ఆశ

కర్నూలు,జూలై21(జ‌నం సాక్షి): ఈ ఏడాదైనా కృష్ణమ్మ కళకళలాడుతుందా అన్న సందేహాలు కలుగుతున్‌ఆనయి. ఎగువన వర్షాలతో ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. కొన్ని రోజుల పాటు ఈ ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రానికి రోజు సుమారు 16 టీఎంసీల నీరు అందుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టిలో సుమారు 1.73 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఆ నీటిని దిగువకు అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాలకు చేరి, అక్కడి నుంచి శ్రీశైలంలోకి వరద వస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 17 గేట్ల ద్వారా 15 టీఎంసీల నీటినివదిలారు. తుంగభద్ర ప్రాజెక్టు కూడా నిండటానికి సిద్ధంగా ఉండటంతో 69 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే తుంగభద్ర నదిలో ప్రవాహం మొదలైంది. ఎగువన జలాశయం నుంచి విడుదలైన నీరు ఆంధ్ర సరిహద్దు మేళిగనూరుకు చేరింది. ఎగువన తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో.. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్తగా జలాశయం అధికారులు ఆరుగేట్ల ద్వారా నీరు దిగువకు పంపగా తుంగభద్ర నదికి నీటిని విడుదల చేశారు. గత మూడు సంవత్సరాలు ఇంతస్థాయిలో నదిలో నీరు ప్రవహించలేదు. మేళిగనూరు వద్ద నదీ జలాలు, నీటి ప్రవాహాన్ని చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నది లోతట్టున ఉండే వ్యవసాయ మోటార్లను బయటకు తరలించేందుకు రైతులు శ్రమించారు. మరోవైపు, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీ వరద నీరు చేరి జయశంకర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 35 పిల్లర్లు నీట మునిగాయి. అధికారులు గడ్డ విూది పనుల్లో వేగం పెంచి, నిర్మాణాలను పరుగులు పెట్టిస్తున్నారు. అన్నారం బ్యారేజీ పనులు కూడా ఆగిపోయాయి. ఇదిలా ఉండగా, భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న జోరు వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీల్లో పలు వాగులు ఉప్పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు 16,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి నీళ్లు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగుకు వరద పెరగడంతో పర్ణశాలలోని నారచీరల వద్ద ఉన్న సీతమ్మవారి విగ్రహాన్ని తాకుతూ వాగు ప్రవహిస్తోంది.

 

తాజావార్తలు