కృష్ణమ్మ జలకళ

నిండుకుండలా శ్రీశైలం,సాగర్‌ ప్రాజెక్టులు

శ్రీశైలం మూడుగేట్లు ఎత్తి నీటి విడుదల

కర్నూలు,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. రెండు ప్రధాన ప్రాజెక్టుఉల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నాయి. ఎగువనుంచి వస్తున్న నీటితో శ్రీశైలం,నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు పూర్తిస్తాయి నీరు చేరుతోంది. ఎగువనుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు సాగర్‌లోకి నీటిని విడుదల చేసారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ప్లో 1,56,656 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ప్లో 1,83,714 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.3 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 206.09 టీఎంసీలుగా నమోదైంది. మరోవైపు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సాగర్‌కు ఇన్‌ప్లో 1,25,774 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ప్లో 44,892గా ఉంది. శ్రీశైలం నుంచి దిగువన సాగర్‌కు నీరు చేరుతోంది. సాగర్‌ పూర్తిస్థాయిలో నిండితే వెంటనే గేట్లు ఎత్తివేయడానికి రంగం సిద్దం చేశారు. ఈ మేరకు ఇంజనీరింగ్‌ అధికారులు ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండడంతో జలకళను సంతరించుకుంటోంది. దీంతో సాగర్‌ అందాలను వీక్షించడానికి పర్యాటకుల అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.నందికొండలో పర్యాటకులతో సందడి నెలకొన్నది. విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీయులు, అధిక సంఖ్యలో నందికొండను సందర్శించారు. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో నాగార్జునకొండకు వెళ్లేందుకు ఉత్సాహం కనబర్చారు. సాగర్‌ నీరు విడుదల చేస్తే దిగువన నీరు పులిచింతలకు చేరనుంది. పులిచింతల ప్రాజెక్టులో ఈ ఏడాది తొలిసారిగా పూర్తి స్థాయి నీటిని నింపేందుకు ఎపి జలవనరులశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వసామర్థ్యం 45.77 టీ.ఎం.సీలు. ప్రాజెక్టును 2013 డిసెంబరులో ప్రారంభించినా నేటి వరకు పూర్తి స్థాయిలో నీటితో నింపలేదు, తాజాగా జలవనరులశాఖ అధికారులు ఈ సీజనులు పూర్తి స్థాయిలో నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులచే ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసి జాతికి అంకితం చేయాలని ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణ కార్యక్రమాలు గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ సురేంద్రమోహన్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌ సంజీవరెడ్డిలను కలసి పరిస్థితిని వివరించారు. సూర్యాపేట జిల్లాలోని మట్టుపల్లి, తమ్మవరం, రేబల్లి, సోమనాధ్‌గూడెంకు చెందిన కొందరు నిర్వాసితులు ముంపు గ్రామాలను ఖాళీ చేయకుండా అక్కడే నివసిస్తున్నారని వారిని వెంటనే ఖాళీ చేయించాలని ఆ జిల్లా రెవిన్యూ యంత్రాంగాన్ని కోరారు. మంపు గ్రామాలను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ యంత్రాగం ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిసింది.

 

తాజావార్తలు