కృష్ణయ్య పార్టీ ఆలోచన పట్టాలెక్కేనా?
హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): రాజ్యాధికారం కోసం బిసిలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఎస్సీలు కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నారు. కానీ వీరంతా ఉమ్మడిగా పార్టీ పెట్టడమో లేదా కలసి పోరాడడమో చేయడం లేదు. కారణం ఆర్థికంగా బలహీనంగా ఉండడమే. అందుకే మందకృష్ణ మాదిగ గద్దర్ లాంటి వారు పార్టీలు పెట్టినా ఉద్యమించినా పెద్దగా ఫలితం సాధించలేక పోతున్నారు. బిసిలు కూడా అంతే. అయితే తాజాగా మళ్లీ పార్టీ ఆలోచనను బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆయన ఎన్నికల్లో ప్రభావం చూపుతారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎస్సీలు లేదా బిసిలు గంపగుత్తగా స్వార్థానికి దూరంగా తమదనుకున్న పార్టీలకు ఓట్లు వేయకపోవడం వల్ల అగ్రవర్ణాలు నడుపుతున్న పార్టీలదే పెత్తనంగా మారింది. అంతెందుకు బిసి అయిన మోడీకి బిసిలు గంపగుత్తగా ఓట్లు వేయగలరా అన్నది అనుమానమే. అయినా కృష్ణయ్య తనవంతుగా పార్టీ పెడతానంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు బీసీలపట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టినా బీసీలంతా మన కోసం పార్టీ పెట్టన్నా..అని అడుగుతున్నారని చెప్పారు. పార్టీ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయన్నారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్‌లో పెట్టిన సభల్లో చాలామంది ‘ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుక్కుతినే వాళ్లల్లానే చేస్తున్నారు, సీట్ల విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే’అని అంటున్నారని చెప్పారు. పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏపీలోనే పెడతానని స్పష్టం చేశారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ
అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారి ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరామ్ పార్టీ పెడితేనే ఎవరూ కదలి రావడం లేదు. అలాంటప్పుడు కృష్ణయ్ ప్రభావం చూపుతారని అనుకోవడం కూడా విఫల ప్రయోగం కాక తప్పదు.