కృష్ణాజిల్లా వైకాపాలో ముసలం

– సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు మల్లాది విష్ణుకు అప్పగింత
– పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతున్న వంగవీటి వర్గీయులు
– రాజీనామా చేసిన వంగవీటి రాధ సోదరుడు శ్రీనివాస్‌
– జనసేనలోకి వెళ్లేందుకు అడుగులు?
– వంగవీటి ఇంటి వద్ద ఉద్రిక్తత
– భారీగా చేరుకున్న వంగవీటి వర్గీయులు, వైకాపా ప్లెక్సీల తొలగింపు
– పెట్రోల్‌ పోసుకొనేందుకు కార్యకర్తల యత్నం
– అడ్డుకొని ఆస్పత్రికి తరలించిన రాధా
– సీటుమారినట్లు తనకు సమాచారం లేదన్న రాధా
– బుజ్జగింపులు మొదలుపెట్టిన వైకాపా నేతలు
– రాధాను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూచేసిన నేతలు
విజయవాడ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : విజయవాడ వైసీపీలో టిక్కెట్‌ వార్‌ మొదలైంది. సెంట్రల్‌ సీటు వ్యవహారంలో రెండు రోజులుగా అసమ్మతి సెగలు రేగాయి. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పగ్గాలు మల్లాది విష్ణుకు అప్పగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో.. మొదటి నుంచి ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధా వర్గీయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన వంగవీటి రాధా అతని అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆ సీటు నుంచే బరిలోకి దిగాలని రాధా భావిస్తుంటే.. విష్ణుకు పగ్గాలు ఇలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌ తీరుపై రాధా వర్గీయులు మండిపడుతున్నారు. సెంట్రల్‌ టికెట్‌ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ.. ఆయన సోదరుడు, ఉయ్యూరు కౌన్సిల్‌, జిల్లా ఫ్లోర్‌ లీడర్‌ వంగవీటి శ్రీనివాస్‌ ప్రసాద్‌ వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పే ఆలోచనలో
ఉన్నట్లు తెలుస్తోంది. కొందరైతే నగరంలోని వంగవీటి రంగా విగ్రహం దగ్గర నిరసనకు కూడా దిగారు.
ఇదిలా ఉంటే.. వంగవీటి రంగా విగ్రహం దగ్గర రాధా అనుచరులు నిరసనకు దిగారు. రంగా ఇంటి దగ్గర, ఆఫీస్‌ దగ్గరున్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రంగా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని రాధా అనుచరులు అధిష్ఠానాన్ని ఒకింత హెచ్చరించారు.
ఇదిలా ఉంటే రాధాకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నారు. అయితే వారిని గమనించిన రాధా అడ్డుకుని వారించారు. పెట్రోల్‌ చింది ఇద్దరి కళ్లల్లో పడడంతో ఆస్పత్రికి తరలించారు. సీటు మారినట్టు తనకు సమాచారం లేదని రాధా చెప్పారు. ఇదిలా ఉంటే రాధా తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో నిర్ణయం తీసుకొని వైసీపీలో ఉండాలా..? వేరే పార్టీలో చేరాలా అనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బుజ్జగింపులు ప్రారంభించిన వైసీపీ నేతలు..
మరోవైపు రాధాను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలు కొందరు.. రాధాకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ నేతలు యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావులు కూడా వంగవీటిని కలిసి బుజ్జగించినట్లు సమాచారం. సెంట్రల్‌ సీటు తలనొప్పిగా మారడంతో.. వైసీపీ మరో ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెస్తోందట. రాధాను మచిలీపట్నం పార్లమెంట్‌ నుంచి బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ నిర్ణయంపై రాధా ఎలా స్పందిస్తారన్నది క్లారిటీ లేదు.
రాధాను లాగేందుకు టీడీపీ ప్రయత్నాలు..
ఇదిలా ఉంటే వంగవీటి కోసం టీడీపీ నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధాతో కొందరు టీడీపీలోకి టచ్‌లోకి వచ్చి… సంప్రదింపులు జరుపుతున్నారట. గతంలోనూ రాధాను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు.. మళ్లీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెంట్రల్‌కు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండటంతో.. ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు. అలాగే వంగవీటి తీసుకునే నిర్ణయాన్ని బట్టి అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోందట. మరి అసంతృప్తితో ఉన్న రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తిగా మారింది.
వైకాపాకు వంగవీటి శ్రీనివాస్‌ రాజీనామా..
కృష్ణా జిల్లా వైకాపాలో అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో కాపు నేతలకు అన్యాయం జరుగుతోందంటూ ఉయ్యూరు కౌన్సిలర్‌, జిల్లా పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ వంగవీటి శ్రీనివాస ప్రసాద్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణకు సోదరుడైన శ్రీనివాస ప్రసాద్‌ రాజీనామా వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి నుంచి పోటీపై జగన్‌ తనకు హావిూ ఇవ్వకపోవడంతో కొంతకాలంగా వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో విజయవాడ సెంట్రల్‌ టిక్కెట్‌ తనకు కేటాయించాలని రాధాకృష్ణ కోరగా పార్టీ ముఖ్య నేతలు సహా జగన్‌ నుంచి హావిూ రాలేదని తెలిసింది. దీంతో పార్టీ సమావేశం నుంచి రాధాకృష్ణ తన అనుచరులతో కలిసి అర్థాంతరంగా వెళ్లిపోయారు. భవిష్యత్‌ కార్యాచరణపై వంగవీటి కుటుంబ సభ్యులు, అనుచరులతో రాధాకృష్ణ నిన్న రాత్రి పొద్దుపోయేవరకు
మంతనాలు జరిపారు. రాధాకృష్ణ సోదరుడు సోమవారం  వైకాపాకు రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.  ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని జగన్‌ ప్రకటించినప్పటి నుంచి ఆయన స్తబ్దుగా ఉన్నారు. పార్టీ పెద్దల తీరు నచ్చకే రాజీనామా చేసినట్లు వంగవీటి శ్రీనివాస ప్రసాద్‌ వర్గీయులు చెబుతున్నారు. జనసేనలో చేరే అవకాశం ఉందంటున్న వంగవీటి వర్గీయులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి శ్రీనివాస్‌ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు..

తాజావార్తలు