కృష్ణా కలెక్టర్‌కు దళితమిత్ర అవార్డు

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలో దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంకు ‘దళిత మిత్ర’ జాతీయ అవార్డు వరించింది. జిల్లాలో షెడ్యూలు కులాలు, షెడ్యూల్‌ తెగల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కలెక్టర్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేశారు. దళితులకు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించటంలో కృష్ణాజిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టారు. దీనిని గుర్తించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ నేతృత్వంలో ఇటీవల కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. అలాగే, ఆయన పనితీరును గుర్తించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దళిత మిత్ర అవార్డుకు ఎంపిక చేసింది. జాతీయ ఎస్సీ కమిషనర్‌ ఎం.మురుగన్‌ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. దీంతో పలువురు కలెక్టర్‌ను అభినందించారు.
సావిత్రీబాయి పూలే అవార్డులకు జాబితా సిద్ధం
జిల్లాలో సావిత్రీబాయి పూలే మహిళా ఉపాధ్యాయిని అవార్డులకు కసరత్తు పూర్తి అయింది. జిల్లాస్థాయిలో ఏర్పాటైన కమిటీ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏకు పంపింది. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి వచ్చే నెల 3న విశాఖపట్నం వేదికగా మహిళా ఉత్తమ ఉపాధ్యాయినులకు ఈ అవార్డుల్ని బహూకరించనున్నారు.గత ఏడాది రాష్ట్ర స్థాయిలో 80 మంది ఉపాధ్యాయుల్ని ఈ అవార్డుతో గౌరవించారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం, విద్యావేత్త జోషీ, డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మీ, పీవో కేడీవీఎం ప్రసాదబాబు తదితరులతో కూడిన 8 మంది సభ్యుల కమిటీ ఉపాధ్యాయుల జాబితాను ఖరారు చేసి రాష్ట్ర స్థాయికి పంపింది. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర స్థాయి జాబితా ఖరారు కానున్నట్లు ఎస్‌ఎస్‌ఏ వర్గాలు తెలిపాయి. జిల్లాలో నిర్దారించిన 24 విభాగాల్లో 32 దరఖాస్తులు అందాయి. వీరిలో పాఠశాల సహాయకులు, ఎస్జీటీలు ఉన్నారు. దరఖాస్తు చేసిన వారిలో 11
క్యాటగిరీలకు మాత్రమే అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఎవ్యిూవో, ఉప విద్యాశాఖాధికారి, డీఈవో ద్వారా అందిన దరఖాస్తులలో 11 మంది మహిళా ఉపాధ్యాయినుల పేర్లను మాత్రమే రాష్ట్ర స్థాయికి పంపారు. గతంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కార గ్రహీతల్ని ఈ జాబితాలో నుంచి మినహాయించారు. ఎంపికైన ఉపాధ్యాయులకు రూ.25 వేల నగదు బహుమతి, శాలువ, షీల్డు, ఒక ట్యాబ్‌ అందజేస్తారు.