కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతి
శ్రీశైలానికి పెరుగుతున్న నీటిరాక
తుంగభద్రకు జలకళ
కర్నూలు,ఆగస్టు13(జనం సాక్షి): కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతి కొనసాగుతున్నది. తుంగభద్ర నుంచి భారీవరద వస్తుండటంతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం జలాశయానికి 78 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లలో వరద స్థిరంగా కొనసాగుతున్నది. దిగువన ప్రకాశం బరాజ్‌కు భారీ వరద నమోదవుతుండటంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలారు.పుణ్యక్షేత్రమైన మంత్రాలయం వద్ద తుంగభద్ర నది వరద జలాలతో పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం వరకు 80 వేల క్యూసెక్కుల వరద నీటితో నది ప్రవాహం కొనసాగింది. జలాశయం నుంచి అధిక మొత్తంలో వదిలిన నీరు మంత్రాలయం చేరాయి. భక్తులు స్నానాలు చేసే ఘాట్ల వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మఠం తులసీ వనం గోడను నీరు తాకుతున్నాయి. మరోవైపు భక్తులు ప్రమాద స్థలాల్లో స్నానాలు చేయకుండా భద్రతా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అక్కడే ఉంచిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది మాటలను భక్తులు లెక్కచేయడంలేదు. దీనివల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు పుట్టీలను ముందుస్తుగా ఏర్పాటుచేశారు. స్థానిక పుట్టీల నిర్వాహకులను నియమించారు. 5 విూటర్ల ఎత్తుకు నీరు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. మంత్రాలయం వద్ద 5 విూటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తే ఇది తొలి ప్రమాద హెచ్చరికగా తెలిపారు.శ్రావణమాసం ప్రారంభం…ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వస్తుండడంతో పర్యటకుల తాకిడి పెరిగింది. ఆదివారం ఆనకట్ట పరిసరాలు సందర్శకులతో కళకళలాడాయి. పర్యటకుల తాకిడితో ఆనకట్ట పరిసరాల్లో ట్రాఫిక్ పెరిగింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వస్తుండడంతో ముఖ్య ఇంజినీరు నారాయణరెడ్డి ఆదివారం ఆనకట్టను సందర్శించారు. ఆనకట్ట నిర్వహణ పనులు, గేట్ల పనితీరు, వరద ప్రవాహం విడుదల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ఇంజినీర్లకు సూచించారు.