కెసిఆర్‌ చర్యలతో ఆలయాలు, చెరువులకు మహర్దశ

కాకతీయుల ఉనికి తెలిపే విధంగా కాకతీయ వైభవ సప్తాహం
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌,జూలై9( జనం సాక్షి): కేసీఆర్‌ పాలనలో పురాతన ఆలయాలు, చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని స్పష్టం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ చేశారు. కాకతీయుల ఉనికి, పరిపాలనను ప్రజలకు తెలిపే విధంగా కాకతీయ వైభవ సప్తాహంను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి, దర్పణానికి ఎన్నో ఆలయాలు అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయని చెప్పారు. కాకతీయ పాలనలో చెరువుల నిర్మాణానికి అద్భుతమైన ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని వినియోగించారు. కాలనుక్రమంలో కొందరి నిర్లక్ష్యం కారణంగా పురాతన ఆలయాలు, చెరువులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్‌ విూడియాతో మాట్లాడుతూ.. కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను అద్భుతంగా తీర్చిదిద్ది వ్యవసాయానికి పెద్ద పీట వేశారని చెప్పారు. కేసీఆర్‌ వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల చెరువులు ఎండాకాలం సైతం నిండుకుండను తలపిస్తున్నాయన్నారు. ఇనుగుర్తి గ్రామనికి, మండలంగా శుభవార్త త్వరలోనే రాబోతుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డి, మార్క్‌ ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, కేసముద్రం మార్కెట్‌ చైర్మన్‌ మర్రి నారాయణ, ఎంపీపీ చంద్రమోహన్‌, జెడ్పిటిసి రావుల శ్రీనాథ్‌ రెడ్డి, సర్పంచ్‌ బిక్షపతి, టీఆర్‌ఎస్‌ నాయకులు వద్దిరాజు కిషన్‌, యాకుబ్‌ రెడ్డి, రాహుల్‌ నాయుడు, ఆర్డీవో కొమురయ్య ఇతర అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.