కెసి కెనాల్ నీటిని తక్షణం విడుదల చేయాలి
మైదుకూరు హైవేపై ఎమ్మెల్యే సమక్షంలో ధర్నా
కడప,ఆగస్టు 8(జనం సాక్షి): కెసి కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేయాలని మైదుకూరు నేషనల్ హైవేపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులనుఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. జులై 29 వ తేదీన కర్నూలులో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ విూటింగ్‌లో ఎస్‌ఆర్‌ఐ, ఎస్‌ఆర్ 2 తెలుగు గంగకు 20 టిఎంసిలతో పాటు కెసి కెనాల్ ఖరీఫ్‌కు తక్షణం నీరు వదలాలని మంత్రి కెఈ.క్రిష్ణ మూర్తి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు సమక్షంలో తీర్మానం చేశారని తెలిపారు. రైతులు సంతోషంతో నారు మళ్ళు సిద్ధం చేసుకున్నారని, కెసి కెనాల్ కు 2 రోజులు నీటిని వదిలి వెంటనే నిలిపేశారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నారుమళ్లు పోసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. కెసి కెనాల్ రైతాంగం ప్రతి సంవత్సరం ఇదే విధంగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. కెసి కెనాల్ రైతాంగానికి శాశ్వతంగా నీరు ఉండాలంటే రాజోలు ఆనకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 2008లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రాజోలి ఆనకట్టకు పునాది వేశారని తెలిపారు. రాజోలి ఆనకట్ట నిర్మాణం, కెసి కెనాల్ కు శాశ్వత పరిష్కారం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా గెలిపించాలని కోరారు. కెసి కెనాల్ వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కడప మాజీ ఎంపి ఆవినాష్ రెడ్డి, కడప, కమలాపురం, ప్రొద్దుటూరులకు చెందిన ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, వైసిపి కడప పార్లమెంట్ ఇంచార్జ్ సురేష్ బాబు, సిపిఐ రైతు విభాగం నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.