కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇస్తాం
– 150మంది ఎంపీల సంతకాలతో స్పీకర్‌కు అందజేస్తాం
– అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తే సభను స్తంభింపజేస్తాం
– తెదేపా ఎంపీ కేశినేని నాని
విజయవాడ, జులై17(జనం సాక్షి) : కేందప్రభుత్వంపై బుధవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విూడియాతో మాట్లాడారు. 150 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసు ఇవ్వబోతున్నామని తెలిపారు. అవిశ్వాస తీర్మానం తిరస్కరిస్తే సభను స్తంభింపజేస్తామన్నారు. ఏపీకి చేసిన అన్యాయం బయటపడుతుందనే బీజేపీ చర్చకు వెనకాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏపీ డిమాండ్లకు మద్దతిస్తున్నాయని నాని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతల బట్టలూడదీస్తామన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. తీర్మానాన్ని చర్చకు ఆమోదిస్తే బీజేపీ నేతల బట్టలు విప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయిందని నాని ఆరోపించారు. సమస్యలు వినిపించాల్సిన వైసీపీ ఎంపీలు రాజీనామాచేసి దీక్షలు చేశారని, ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో కేంద్ర విద్యాసంస్థలకు రూ.12 వేల కోట్ల విలువైన భూమి ఇస్తే.. ప్రహారీ గోడ కట్టేందుకు కనీసం రూ. 600 కోట్లు కూడా ఇవ్వలేదని కేశినేని నాని ఎద్దేవా చేశారు. కేంద్రం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో ఆ పార్టీకి సహకరించే ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.