కేంద్రం అన్యాయం చేస్తే.. రాష్ట్రాన్ని శిక్షిస్తారా?
– వైకాపా బంద్‌తో ప్రయోజనమేంటి?
– రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే పెట్టుబడులు రావు
– యువత ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతారు
– రాష్ట్రానికి మరింత నష్టం చేయాలని వైకాపా చూస్తోంది
– ప్రతిపక్ష పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం
– విభజన హావిూలు నెరవేర్చేదాకా కేంద్రాన్ని వదిలేది లేదు
– పార్లమెంట్ లోపల, బయట ఆందోళనలు ఉదృతం చేయండి
– పార్లమెంటులో పోరాటం ఆపొద్దని ఎంపీలకు బాబు దిశానిర్దేశం
అమరావతి, జులై24(జనంసాక్షి) : కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రంతో పోరాడాలని.. అలా కాకుండా వైకాపా రాష్ట్రంలో బంద్ పేరుతో ప్రజలను ఇబ్బందులు పాలు చేయడం ఎంతవరకు ప్రయోజనమని, వైకాపా బంద్ వల్ల అసలు ప్రయోజనం ఏముంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెదేపా ఎంపీలతో చంద్రబాబు మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి రోడ్లపై తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనే వైకాపా బంద్ పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విభజన హావిూలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బంద్‌ల పేరుతో మరింత నష్టం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రాన్ని బంద్‌ల పేరుతో ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. కేంద్రం చేసిన తప్పులకు రాష్ట్రాన్ని శిక్షించడం ఏంటని వైకాపా నేతలను నిలదీశారు. కేంద్రంపై పోరాటం వదిలేసి రాష్ట్రంలో బంద్ చేపట్టడం వల్ల సాధించేది ఏమిలేదని చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి హితవు పలికారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్యపరచాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. నాయకత్వ సామర్ధ్యం చూపడానికి ఇదొక అవకాశమన్న చంద్రబాబు సూచించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభలో ఆందోళనలు కొనసాగించడంతో పాటు సభ వెలుపల కూడా నిరసనలు తెలపాలని ఎంపీలకు సూచించారు. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి చట్టాన్ని ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. విభజన హావిూలు అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హావిూలు నెరవేర్చేవరకు వదిలిపెట్టమని… తెలుగు పౌరుషం చూపిస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కూడా పన్నులు చెల్లిస్తున్నందున సంక్షేమం చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేననిదని, అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలని ఆకాంక్షించారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదని, ఇన్నాళ్లు అడిగాం కాబట్టే ఇప్పుడు నిలదీస్తున్నామన్నారు. ప్రశ్నోత్తరాలు, శూన్యగంట, బిల్లులపై చర్చలు ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏపికి జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే పెట్టుబడులు రావని యువతకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఆలోచనలు రాష్ట్రానికి వచ్చే రాబడిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆక్షేపించారు. రాష్ట్రానికి నష్టం చేయడం ద్వారా కేంద్రంపై పోరాటాన్ని నీరుగార్చొద్దని హితవు పలికారు. మన వేలితో మన కళ్లు పొడవవద్దని.. రాష్ట్రంలో అశాంతి సృష్టించవద్దని హెచ్చరించారు.