కేంద్రం చెప్పేవన్నీ దొంగ లెక్కలు
– అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసేవారు ఇక్కడికొచ్చి మాట్లాడాలి
– ఏపీ మంత్రి నారాయణ
అమరావతి, జులై13(జనం సాక్షి) : ఏపీ రాజధాని అమరావతి నిధుల విషయంలో కేంద్రం దొంగ లెక్కలు చెబుతోందని మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసేవారు ఇక్కడికొచ్చి మాట్లాడాలని అన్నారు. శుక్రవారం రాజధానిలో పర్యటించిన మంత్రి అక్కడి ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం 4 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రెండు నెలల్లో కొన్ని అపార్టుమెంట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. వచ్చే మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. విమర్శలు చేసేవారికి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏపీని అన్ని విధాల కేంద్రం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల మనోభావాలను బీజేపీ తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. విభజన చట్టంలోని హావిూలనుఅ మలు చేయకుండా అరకొర నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కేంద్రం అడ్డంకిగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు 21సార్లు నిధులు మంజూరు చేయాలని కేంద్రం చుట్టూ తిరిగినా పట్టించుకోని కేంద్రం ఇప్పుడు అది చేశాం.. ఇది చేశాం అంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్రం సహకారం లేకుండా మొక్కవోని దీక్షతో ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు చంద్రబాబు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని, సహకరించే వైసీపీ, జనసేనలను ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నారాయణ హెచ్చరించారు.