కేంద్రం నిధులపై..
బీజేపీ శ్వేతపత్రం అడగడం హాస్యాస్పదం
– ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చాక అప్పుడు అడగండి
– బీజేపీ-వైసీపీ లాలూచీ పడ్డాయని రాందాస్ అథవాలే వ్యాఖ్యలతోనే తేలింది
– పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పుచేతల్లో ఉండే వ్యక్తి
– విలేకరుల సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి యనమల
అమరావతి, జులై18(జనం సాక్షి) : కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు అడగడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇచ్చాక అప్పుడు అడగండి శ్వేతపత్రమని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా బీజేపీ, వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్లు, ఇండ్లు, ఉపాధి నిధులు అన్ని రాష్టాల్రకు
ఇచ్చారని, కామన్ కేటగిరి కింద ఏపీకి ఎంత ఇచ్చారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ కేటగిరి కింద ఎంత ఇచ్చారో కేంద్రాన్నే ప్రకటించమనండని సూచించారు. ఢిల్లీ-ముంబై ఇండస్టియ్రల్ కారిడార్‌కు ఎంత ఇచ్చారని, వైజాగ్-చెన్నై ఇండస్టియ్రల్ కారిడార్‌కు ఎంత ఇచ్చారో చెప్పాలని మంత్రి యనమల ప్రశ్నించారు. బీజేపీ – వైసీపీ లాలూచీ పడ్డాయని రాందాస్ అథవాలే వ్యాఖ్యలతో తేలిందని అన్నారు. అవినీతి కేసులో నిందితుడితో పొత్తుకు బీజేపీ ఆరాటపడుతోందని మండిపడ్డారు. పవన్‌కల్యాణ్ బీజేపీ చెప్పుచేతల్లోనే ఉన్నారని ఆరోపించారు. బీజేపీని వదిలి టీడీపీని విమర్శించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని…సరైన గుణపాఠం చెబుతారని మంత్రి యనమల తెలిపారు.