కేంద్రం మెడలు..


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రం మెడలు వంచారు. ప్రజల ఆకాంక్షపై యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు మెట్టు దిగలేదు. ఎంతగా బుజ్జగించినా, భయపెట్టినా బెట్టు వీడలేదు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించే వరకు పార్లమెంట్‌ గడప తొక్కలేదు. మీటింగ్‌ తేదీ ప్రకటించేలా ఒత్తిడి పెంచి విజయం సాధించారు. రాష్ట్రంలోని ఎనిమిది పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించాలని షరతు విధించారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీలు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. విప్‌ను ధిక్కరించి పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మూడు రోజుల పాటు తమ ఆందోళన కొనసాగించి, డిసెంబర్‌ 9లోగా అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డెడ్‌లైన్‌ విధించారు. అధినేత్రి సోనియాగాంధీని పార్లమెంట్‌ లాబీల్లో కలిసి ఈ విషయమై నోట్‌ సమర్పించారు. పార్లమెంట్‌లో తెలంగాణపై చర్చించేం దుకు అనుమతి ఇవ్వాలని కోరారు. చిల్లర వర్తకంలోకి వీదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై పార్లమెంట్‌లో ఓటింగ్‌తో కూడిన చర్చ వీరికి కలిసి వచ్చింది. కాంగ్రెస్‌ ఓటింగ్‌లో గట్టేందుకు స్వపక్ష సభ్యులతో పాటు మిత్రపక్షాలు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్న వారి మద్దతు కూడగట్టే పనిలో

పడింది. అప్పటికే అధిష్టానానికి వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేసే స్థాయిలో వెళ్తున్న టీ ఎంపీలను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని అధిష్టానం పావులు కదిపింది. ఈమేరకు మంగళవారం తమతో చర్చలకు హాజరుకావాలని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమలనాథ్‌ ఎంపీలకు వర్తమానం పంపారు. కానీ ఎంపీలు వారి ఆదేశాలను పట్టించుకోలేదు. తమకు ప్రజల ఆకాంక్షయిన తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రులతో భేటికి మంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సురేశ్‌ షెట్కర్‌ మాత్రమే హాజరయ్యారు. కేబినెట్‌ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, మధుయాష్కీ గౌడ్‌, వివేక్‌, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో కలవరపడ్డ అధిష్టానం ఎంపీలను బుజ్జగించే పనిలో పడింది. ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మంత్రి జైపాల్‌రెడ్డితో సంప్రదింపులు జరిపి ఎంపీలను ఒప్పించే బాధ్యతను జైపాల్‌పై పెట్టింది. ఆయనతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ తెలంగాణపై ఎంపీలు పట్టుబడుతున్న విషయాన్ని అధినేత్రి సోనియాకు వివరించారు. ఈ మేరకు ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. చర్చోపచర్చల తర్వాత ఎంపీలు కోరినట్లుగా ఈనెల 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక్కొక్కరినే అఖిలపక్షానికి ప్రతినిధులుగా పంపాలని కోరుతామని హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించారు. కేంద్రం ప్రకటనపై టీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు సంకుచిత భావాలు విడనాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని వారు కోరారు. ఎంపీల పట్టుదలతో కేంద్రం అఖిలపక్షానికి అనుమతించడం సీమాంధ్ర పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మింగుడుపడకుండా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖరాశారు. కానీ యూపీఏ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేస్తుందని ఆయన ఊహించలేదు. మేం స్పష్టతతో ఉన్నామంటూ తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన బుధవారమే ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశించారు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. మాట వరుసకు లేఖ రాస్తే కేంద్రం అందుకు అంగీకరించడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా ఉన్న వైఎస్సార్‌ సీపీ తెలంగాణలోనూ తన ప్రాభవాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఒక్క ప్రతినిధినే అఖిలపక్షానికి పంపాల్సి రావడంతో ఢిల్లీలో వారు ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ చెప్తున్న ఈ రెండు పార్టీల నేతలు ఇప్పుడు తీసుకునే స్టాండ్‌పైనే ఆ పార్టీల మనుగడ ఆధారపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.