కేంద్రప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు
ఆదిలాబాద్, జూలై 7 : కేంద్రప్రభుత్వం విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యుపిఎ ప్రభుత్వ విధానాల వల్ల సాగునీటితో పాటు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నదని అన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కిసాన్‌మోర్చా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఆదిలాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్ఠతకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రత్యేక సాధన బిజెపితోనే సాధ్యమని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల విశ్వాసాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామసుందరరావు, శ్రీరామ్‌నాయక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.