కేంద్రానికి బాధ్యతలు గుర్తు చేయడానికే ధర్మపోరాట దీక్ష

విజయనగరంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి,ఎంపి

విజయనగరం,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేంద్రానికి తన బాధ్యతని గుర్తు చేయడానికే సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు. విజయనగరంలో ఈ నెల 27 న నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షకు ముస్తాబవుతున్న అయోధ్య మైదానాన్ని మంత్రి సుజాయ్‌ కృష్ణ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజులు శనివారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుజాయ్‌ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. ధర్మపోరాట దీక్ష ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. సభకు వచ్చే ప్రజలందరికీ అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నామన్నారు. విజయనగరం పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. 200 మంది కూర్చొనే విధంగా వేదికను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ..కేంద్రం ఎపికి ఇచ్చిన ఏ ఒక్క హావిూని నెరవేర్చలేదన్నారు. 11 కేంద్ర విద్యా సంస్థలకు రైతులు భూములనిచ్చినా కేంద్రం నిధులివ్వడం లేదన్నారు. ఎపిలో ప్రతిపక్షం కూడా ప్రజలకు దూరంగా ఉందని, అసెంబ్లీకి డుమ్మా కొడుతుందని ఎద్దేవా చేశారు. కోడికత్తి కథకు ప్రతిపక్ష నేతలు ప్రాధాన్యతనిస్తున్నారని, రాజకీయాన్ని నవ్వులపాలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రానికి తన బాధ్యతని గుర్తు చేయడానికే సిఎం చంద్రబాబు ఈ ధర్మపోరాట దీక్ష చేపడుతున్నారని తెలిపారు. ఎపి విభజన హావిూలను నెరవేరుస్తుందనే కాంగ్రెస్‌తో కలిసి వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు, మంత్రి సుజయ క్రిష్ణ, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.