కేంద్ర వైఖరి చెప్పే వరకూ..ఉద్యమంఆగం
మెదక్, నవంబర్11(జనంసాక్షి):
కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలియజేశారు. జహిరాబాద్‌లో జరిగిన విద్యార్థి జేఏసీ ‘ఆత్మ గౌరవ పాదయాత్ర’ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు చేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించని తెలంగాణ ప్రాంత మంత్రులు, మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం సాగుతుందని తెలిపారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమ మలిదశ కార్యచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా కోదండరాం వెల్లడించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, టీఆర్‌ఎస్‌తో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్థృతం చేస్తామని ఆయన తెలిపారు. ఉద్యమ కార్యచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యాలు సంతృప్తికరంగా లేవని కోదండరాం
వ్యాఖ్యానించారు. డిసెంబర్9 ప్రకటన చేసి మూడేళ్లు కావొస్తుందని, ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఇంకొద్ది రోజులు ఆగాలనడం కేంద్రం దాటవేత ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి శక్తి కీలకమైందని, విద్యార్థుల పోరాటంతో కేంద్రం ఆగమవుతందన్నారు. విద్యార్థి శక్తి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యమన్నారు. కావున విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.