కేరళకు 7కోట్ల సాయం ప్రకటించిన యాపిల్‌ సంస్థ

తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): భారీ వరదలతో అతాలకుతలమైన కేరళను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. పలు సంస్థలు వితరణ ప్రకటించాయి. అనేకులు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. డబ్బు, నిత్యావసర వస్తు సామగ్రిని సాయం చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ. 7కోట్లు విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. ‘కేరళలో వరదల పరిస్థితి గురించి తెలిసి మేం ఎంతగానో దిగ్భాంతి చెందాం. కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్‌ ఇండియాకు రూ. 7కోట్లు విరాళంగా ఇస్తున్నాం’ అని యాపిల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళను ఆదుకునేందుకు ముందుకురావాలని యూపిల్‌ యూజర్లను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం యాప్‌ స్టోర్‌, ఐట్యూన్‌లలో డొనేట్‌ బటన్‌ ఏర్పాటుచేసింది. ఈ బటన్‌ ద్వారా యాపిల్‌ యూజర్లు తమ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కేరళకు విరాళం ఇవ్వొచ్చని వెల్లడించింది. ప్రకృతి ప్రకోపానికి కేరళ అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు తరలివెళ్తున్నారు. ఈ వర్షాల్లో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ కేరళ ప్రజలకు అండగా ఉంటున్నారు.