కేరళను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు

మరణించిన వారి సంఖ్య 39కి చేరిక

మరో రెండురోజులు వర్షాలు తప్పవన్న వాతావరణశాఖ

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఆగస్టు 8వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. కాగా ఈ వర్షకాలంలో కేరళలో ఇప్పటివరకు 186 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. 211 చోట్ల కొండచరియలు కూలిన ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. కేరళలోని చాలా ప్రాంతాల్లో ఆగస్టు 15వ తేదీ వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 1924 తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వరదల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ.8,316కోట్ల నష్టం కలిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దాదాపు 10వేల కిలోవిూటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తు ప్రభావం రాష్ట్రంపై దీర్ఘకాలం పాటు పడనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. 20వేల ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. 10వేల కిలోవిూటర్ల మేర రాష్ట్ర ప్రజా పనుల విభాగం రోడ్లు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు అన్నీ తీవ్రంగా పాడైపోయాయని.. వీటి పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నామని ఇడుక్కి జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని పది జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. నీటిమట్టం పెరగడంతో 27 ఆనకట్టల గేట్లు తెరిచారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం కేరళలో ఏరియల్‌ సర్వే నిర్వహించి.. రూ.100కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. త్రివిధ దళాలకు చెందిన సహాయక సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. దాదాపు 60వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. మృతుల కుటుంబీకులకు, ఇళ్లు కోల్పోయిన వారికి రూ.4లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి రూ.10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.