కేరళ ఇడుక్కి జిల్లాల్లో దారుణం
ఒకేకుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్య
హత్యానంతరం ఇంటి వెనకే పూడ్చివేత
చేతబడి అనుమానంతో హత్య చేశారా అన్న అనుమానాలు
రంగంలోకి దిగిన పోలీసులు..దర్యాప్తు ముమ్మరం
తిరువనంతపురం,ఆగస్ట్2(జనం సాక్షి): తిరువనంతపురం మూకహత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన వారిని ఎలా ఎందుకు చంపాల్సి వచ్చిందీ..ఎవరు దీనికి కారకులన్నది ఆరా తీస్తున్నారు. కేరళలోని ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంచలనం రేపుతోంది. అంతేగాకుండా వీరిని ఇంటి వెనకనే పూడ్చేశారు. ఇడుక్కి జిల్లాలోని తొడుపుజ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ కుటుంబంలోని భార్యభర్తలు, వారి కూతురు, కొడుకును ఎవరో చంపి పూడ్చిపెట్టగా గుర్తించారు. వారిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటి వెనుకే గొయ్యి తవ్వి నలుగురినీ ఒకరిపై ఒకరిని పెట్టి పూడ్చేశారు. ఇంట్లోని వ్యక్తులు రెండు మూడు రోజులుగా బయటకు రావడం లేదని గమనించిన పొరుగు వాళ్లు బుధవారం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడడంతో విషయం బయటపడింది. ఇంట్లో అక్కడక్కడా రక్తపు మరకలు ఉన్నాయి. ఇంటి వెనుకకు వెళ్లగా ఓ చోట గొయ్యి తవ్వి పూడ్చేసినట్లు కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో తవ్వగా నలుగురి మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను కె.కృష్ణన్(52), ఆయన భార్య సుశీల(50), కుమార్తె అర్ష(21), కుమారుడు అర్జున్(20)లుగా గుర్తించారు. వారి శరీరాలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో కత్తి, సుత్తెను స్వాధీనం చేసుకున్నారు. సుత్తెతో బలంగా కొట్టడం వల్ల వాళ్లు చనిపోయినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆదివారం వీరిని చంపి పూడ్చి పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబానికి బాగా తెలిసిన వారే హత్యలకు పాల్పడి ఉంటారని, ఈ నేరంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మరణం వెనుక చేతబడి కారణమా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లోని వాళ్లు ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడేవాళ్లు కాదని స్థానికులు పోలీసులకు చెప్పారు. కృష్ణన్‌కు రబ్బర్ ప్లాంట్ ఉందని, అయితే ఆయన జ్యోతిష్కుడు అని, తాంత్రిక పూజలు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయనితెలిపారు. రాత్రిపూట పెద్ద పెద్ద కార్లలో చాలా మంది కృష్ణన్ వద్దకు వస్తుంటారని కూడా ఇరుగు పొరుగు వాళ్లు పోలీసులకు వెల్లడించారు. దీంతో చేతబడి చేశారనే అనుమానంతోనే ఎవరైనా కుటుంబం మొత్తాన్ని చంపేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లూస్ కోసం యత్నిస్తున్నారు.