కేరళ వరదలకు 483 మంది మృతి

– శతాబ్ధకాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి
– 305 పునరావాస కేంద్రాల్లో 59,296మంది ఇంకా తలదాచుకుంటున్నారు
– పూర్వవైభవానికి చాలా సమయం పడుతుంది
– అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌
తిరువనంతపురం, ఆగస్టు30(జ‌నం సాక్షి) : దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా కేరళను వరదలు ముంచెత్తాయని, వరదల భీభత్సంతో కేరళ అస్తవ్యస్తంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. గురువారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద బీభత్సానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా వరదలకు కేరళను అల్లకల్లోలం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 483 మంది ప్రాణాలు కోల్పోయినట్లు  తెలిపారు. వరదల సమయంలో దాదాపు 14.50లక్షల మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారని తెలిపారు. వరదల కారణంగా 15 మంది గల్లంతయ్యారని చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం.. 305 పునరావాస కేంద్రాల్లో 59,296 మంది తలదాచుకుంటున్నారు. మొత్తం 57 వేల ఎకరాల్లోని పంట నీటమునిగిపోయింది. దీని నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఆగస్టు 9 నుంచి 15 మధ్యలో 98.5మి.విూ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కానీ 352.2ఎంఎం వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని డ్యాంలు అన్ని నీటితో నిండిపోయాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. వరద తీవ్రత కారణంగా రాత్రికి రాత్రే డ్యాంల గేట్లను ఎత్తివేయాల్సి వచ్చింది. ప్రమాద స్థాయిని గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. దాదాపు 14 రోజుల్లో కేరళకు విరాళంగా రూ.713.92కోట్లు వచ్చాయని విజయన్‌ తెలిపారు. వరద వల్ల నష్టపోయిన కేరళకు పునఃవైభవం తీసుకొచ్చేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న భారత ఆర్మీ, నావికాదళం, బీఎస్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ జవాన్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించిన మత్స్య కారులకు ఆయన సెల్యూట్‌ చేశారు.