కేరళ విపత్తుపై ఐరాస దిగ్భాంత్రి

– విచారం వ్యక్తం చేసిన ప్రధాన కార్యదర్శి ఆంటినో గుటెర్రెస్‌
ఐక్యరాజ్య సమితి, ఆగస్టు18(జ‌నం సాక్షి) : భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటినో గుటెర్రెస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ‘మానవతావాదులైన మా స¬ద్యోగులు, భారత్‌లోని మా బృందం కేరళలోని వరదల పరిస్థితిని చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. భారత్‌లో వరదల కారణంగా వందల మంది చనిపోవడంపై ఎంతగానో విచారిస్తున్నాం’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి విలేకరులకు వెల్లడించారు. కేరళకు సహాయం అందిస్తారా అని ఐరాస అధికార ప్రతినిధిని విలేకరులు ప్రశ్నించగా, భారత ప్రభుత్వం నుంచి తమను సహాయం కోరుతూ నేరుగా ఎలాంటి అభ్యర్థన అందలేదని వెల్లడించారు. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన సహాయక చర్యలు, దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ భారత్‌ వద్ద ఉందని తెలిపారు. భారత్‌లోని తమ ప్రతినిధుల బృందం సహాయం అందిస్తోందని చెప్పారు. కేరళలో వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు 80 ఆనకట్టలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 3.14లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. సుమారు 380 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీ, వాయు దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్‌ సర్వే చేపట్టారు. రూ.500కోట్ల సహాయాన్ని ప్రకటించారు.