కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం

– నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అత్యధికంగా ఇనుగుర్తి మండల కేంద్రంలో అత్యధికంగా 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారు కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై వరద ప్రవహించడంతో కంకర కొట్టుకుపోయింది.

దీంతో రైల్వే ట్రాక్‌ ధ్వంసమై విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ నుంచి అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాలలో చెరువు మత్తడి పోయడంతో పలు ఇళ్లలోకి నీరు చేరి, నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. చెక్ డ్యామ్​లు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కల్వర్టుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కేసముద్రం మండలలో పలు ఇళ్లల్లో, దుకాణాల్లోకి వరద నీరు చేరింది.మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండల కేంద్రం శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గూడూరు నుంచి కేసముద్రం, నెక్కొండ, గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాలలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారుల ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్​ను ఏర్పాటు చేశారు. అత్యవసరం ఉంటే ప్రజలు 7995074803 నంబర్​కు ఫోన్​ చేయాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.