కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు

` ఎర్రవల్లిలో విచారణ కుదరదు
` మాజీ సీఎం విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్
` నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి
` ఆదివారం 3గంటలకు సిద్ధంగా ఉండాలని సూచన
` కేసీఆర్‌కు నోటీసులపై బీఆరఎస్ నిరసన
హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కాగా, నిన్న( గురువారం) సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటు లో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలని కేసీఆర్ కు సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని జనవరి 29న 160 సీఆర్ పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండగా..బంజారాహిల్స్ లోని నందినగర్ లో ఆయన నివాసంలో అధికారులు నోటీసులు అందించారు. జనవరి 30న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలని అధికారులకు సూచించారు. అలాగే భవిష్యత్ లోనే ఎలాంటి నోటీసులైనా..ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ అడ్రస్ కే పంపాలని విన్నవించారు. అయితే కేసీఆర్ వినతిపై న్యాయనిపుణులతో చర్చించిన సిట్ ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. అలాగే ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3గంటలకు బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో విచారిస్తామని నోటీసు జారీ చేసింది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను ఎక్కడ విచారించాలనే దానిపై సిట్ అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి, న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే విచారించాలని నిర్ణయించారు.
నోటీసులపై బిఆరఎస్ నిరసన
మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆరఎస్ లక్క్ష్మీదేవిపల్లి శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు లక్క్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ శ్రేణులు శుక్రవారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సిట్ నోటీసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బూటకపు కేసులు, విచారణలు పక్కనపెట్టి ముందు తెలంగాణ రాష్ట్ర అభివద్ధి పనులపై దష్టి సాధించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు ఇగ్బాల్ పాషా, ప్రశాంతి నగర్ ఉప సర్పంచ్ ఎర్రబడి శ్రీను, శ్రీకాంత్ నాయక్, మాజీ సర్పంచులు తాడూరి రజాక్, కోరం చంద్రశేఖర్, పొదిలి వెంకటాచలం, బీఆరఎస్ మండల నాయకులు రాజావరపు మురళి, కల్లుగడ్డ సురేష్ తదితరులు పాల్గొన్నారు.