కేసీఆర్‌కు అనారోగ్యం
మేథోమధనం 7 కు వాయిదా
హైదరాబాద్, నవంబర్ 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 5, 6 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన మేథోమధనం వాయిదా వేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు ఎస్‌ఎంఎస్ ద్వారా మీడియాకు తెలిపాయి. భవిష్యత్తు కార్యా చరణను రూపొందించేందుకు ఈ నెల 5, 6 తేదీల్లో కరీంనగర్‌లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య నాయకులతో మేథోమధనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ గతంలో ఢిల్లీ వెళ్లకముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఆ తరువాత వాయిదా వేశారు. ఢిల్లీ వెళ్లొచ్చాక రహస్యంగా తన సొంత ఫాంహౌస్‌లో గడిపిన కేసీఆర్ దసరా వరకు తెలంగాణ వస్తుందంటూ తనను కలిసిన వారందరితో చెబుతూ వచ్చారు. కేంద్రం మాత్రం అటువంటి సంకేతాలు లేవంటూ స్పష్టం చేయడంతో కేసీఆర్ ఖిన్నుడయ్యారు. తిరిగి ఉద్యమం వైపు దృష్టి సారించారు. ఇపుడు మళ్లీ మూడు రోజుల పాటు వాయిదా వేయడానికి కేసీఆర్ అస్వస్థతే కారణమా? ఢిల్లీ నుంచి ఏవైనా సంకేతాలు వచ్చాయా? అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.