కేసీఆర్‌ మాటలను ప్రజలు విశ్వసించరు : కడియం

కరీంనగర్‌, నవంబర్‌ 9 : తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని ఆడిందే ఆటగా, పాడిందే పాటగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యవహరించాడని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం నాడు స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ను అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని అన్నారు. నిన్నటి వరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ ఏర్పాటుకు సుముకంగా ఉందని చెప్పి, ఇదిగో వచ్చే, అదిగో వచ్చే అంటూ కాలం వెళ్లదీసాడని, సాధించింది ఏమీ లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను వదిలి టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్నారని ఇది తగదని ప్రజలు మెప్పుపొందడానికే కేసీఆర్‌ ఇలాంటి ఎత్తుగడులు వేస్తున్నారన్నారు. ఏనాడూ కూడా తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నోమార్లు ప్రకటించారని అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్‌ కాంగ్రెస్‌కు ఏజెంటుగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఢిల్లీకి వెళ్లిన ఆయనను కాంగ్రెస్‌ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో తిరిగి రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నాడని ఇతని వ్యవహార శైలి ఇలాంటిదని ఆరోపించారు. ఇతని ప్రవర్తనను, మాటల ధోరణిని తెలంగాణ ప్రజలు ఏ మాత్రం నమ్మరని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో అవతారాలు ఎత్తాడని, ఇక మిగిలింది ఒక్క నరసింహ అవతారమని అది కూడా ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ తన కుటుంబ సాలన కోసమే 12 సంవత్సరాలు తెలంగాణను అడ్డుపెట్టుకొని లాభపడ్డారని, ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందేనని కడియం శ్రీహరి అన్నారు. ఏ పార్టీతో టీఆర్‌ఎస్‌ పోటీ పడకుండా వంద సీట్లు అసెంబ్లీకి, 15 సీట్లు పార్లమెంట్‌కు గెలుస్తానని ప్రగల్భాలు పలికాడని ఆయన ఆరోపించారు. ఇక ఆయన పగటి కలలు కనవద్దని శ్రీహరి,  కేసీఆర్‌కు హితవు పలికారు. తన కుటుంబ రాజకీయ లబ్ధికోసమే కేసీఆర్‌ వ్యవహరిస్తున్నాడని తెలంగాణ ఏర్పాటు కోసం ఏమీ చేయడం లేదన్నది స్పష్టమైందని కడియం ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జి.కమలాకర్‌, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌, కె.ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.