కేసీఆర్‌ లేఖ రాస్తే సీబీఐ విచారణకు ఆదేశిస్తాం

` మేడిగడ్డ బ్యారేజీని సందర్శనలో కిషన్‌రెడ్డి
` మొన్న రాహుల్‌ గాంధీ.. నిన్న కిషన్‌ రెడ్డి
` అసెంబ్లీ ఎన్నికలవేళ విపక్షాలకు దొరికిన బ్రహ్మాస్త్రం మేడిగడ్డ
భూపాలపల్లి బ్యూరో(జనంసాక్షి):రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌ పియర్స్‌ కుంగి పోవడం చుట్టూ స్టేట్‌ పాలిటిక్స్‌ రోజు రోజుకు హీటెక్కుతున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడి కుటుంబ పాలనకు పెద్దపీట వేశారని కొద్ది సంవత్సరాలుగా విపక్షాలు పదే పదే అదే ఆరోపణలు చేస్తుండగా, అందుకు తగ్గట్టుగా మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌ వద్ద మూడు పియర్స్‌ పొంగిపోవడం ఎన్నికలవేళ విపక్షాలకు బ్రహ్మాస్త్రం దొరికినట్లైంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ బిజెపిలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రచారానికి మరింత పదును పెడుతున్నాయి. మేడిగడ్డ వద్ద పియర్స్‌ కుంగిన విషయం బయటపడిన సందర్భంలో రాహుల్‌ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో వెంటనే ఆయన మేడిగడ్డ పర్యటనకు వచ్చి కెసిఆర్‌ అవినీతి పై  విమర్శనాస్త్రాలు సంధించారు. కెసిఆర్‌ అనాలోచిత నిర్ణయాల కారణంగా మేడిగడ్డ నిర్మాణ లోపాలు రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారయని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని రాహుల్‌ గాంధీ మేడిగడ్డ వేదికగా డిమాండ్‌ చేయగా. శనివారం కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి సైతం మేడిగడ్డ బాట పట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాదు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్‌ తో పాటు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై నిప్పులు చెరిగారు. మేడిగడ్డ బ్యారేజ్‌ నాణ్యత లోపం వల్ల కాలేశ్వరం ప్రాజెక్టు భారంగా మారిందని ఆరోపించారు. నవంబర్‌ 30న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్‌ ఇటు బిజెపి మేడిగడ్డ వస్త్రాన్ని ఓటర్ల పై ప్రయోగించి లబ్ధి పొందాలని తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.