కొండచిలువను దొంగిలించి.. ప్యాంటులో దాచి..
హైదరాబాద్ : దుకాణాల్లో రకరకాల వస్తువుల్ని దొంగలించే చిల్లర దొంగల్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ వ్యక్తి పెంపుడు జంతువుల దుకాణం నుంచి ఏకంగా కొండచిలువనే దొంగిలించాడు. దాన్ని ఎవరికీ కనిపించకుండా ప్యాంటులో దాచేశాడు. దుకాణంలోంచి బయటకు వెళ్లే దాకా అది తన ప్యాంటులో ఉన్నా లేనట్లే నటించాడు. అది పాము ఆహారం తీసుకునే రోజు కాదు కాబట్టి సరిపోయిందిగాని లేదంటే కొరివితో తలగోక్కున్నట్లే అయ్యేదని దుకాణ యజమానులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే… అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌లో ‘ఏ టు జడ్ పెట్స్’ అనే పెంపుడు జంతువుల దుకాణం ఉంది. దానిలో ఉండాల్సిన రెండడుగుల కొండచిలువ గత శుక్రవారం కనిపించకుండా పోయింది. దీంతో దుకాణ యజమానులు సీసీటీవీ ఫుటేజీల్ని పరిశీలించారు. ఓ వ్యక్తి దాన్ని దొంగలించి తన ప్యాంటులో దాచి బయటకు తీసుకెళ్లిన దృశ్యాల్ని చూసి అవాక్కయ్యారు.
ఈ విషయమై దుకాణ యజమాని బుజ్గన్ మాట్లాడుతూ.. ‘ఆ కొండ చిలువకు అది ఆహారం పెట్టే రోజు కాదు. సాధారణంగా సోమవారాలు వాటికి ఆహారం పెడతాం. ఆ రోజు అవి చాలా ఆకలిగా ఉంటాయి. అలాంటి రోజు కాకుండా మామూలు రోజు అతడు పామును దొంగిలించాడు. దాని ధర 200 డాలర్ల వరకు ఉంటుంది. దాన్ని దొంగిలించినందుకు పోలీసులకు చెప్పి అతడిని అరెస్టు చేయించలేదు. ఆ దొంగ ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నీ మాకు తెలుసు. అందుకని అతనే పామును వెనక్కి తీసుకొచ్చి ఇస్తాడని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.