కొనసాగుతున్న భద్రాచలం బంద్..
ఖమ్మం : భద్రాచలం కేంద్రంగా ప్రత్యేకంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ పరిషత్, సేవ్ భద్రాద్రి కమిటీలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో భద్రాచలం డిపో పరిధిలోని బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేయడం జరిగిందని నేతలు తెలిపారు. భద్రాచలాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా భద్రాచలం ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందన్నారు. దానిని పూడ్చడానికి భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ప్రకటన చేయాలన్నారు. రాష్ట్ర విభజన వల్ల భద్రాచలం మన్యం చిన్నాభిన్నమైందని, మన్యంలోని పలు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయని, భద్రాచలంకు పూర్వ వైభవం రావాలంటే భద్రాచలంను జిల్లా కేంద్రంగా చేయడమే సరైన మార్గమని పలువురు సూచిస్తున్నారు. భద్రాచలంకు ఉన్న చరిత్ర, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం, భౌగోళిక పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఆదివాసీలు అధికంగా ఉండటం వల్ల ఆదివాసీ జిల్లాగా భద్రాచలంకు నామకరణం చేయాలని ఆదివాసీలు పట్టుబడుతున్నారు. అతిపెద్ద ఐటీడీఏ, ఖమ్మం కలెక్టరేట్‌తో పోలిస్తే పదింతలు విశాలమైన ప్రాంగణ ఉండటం కూడా భద్రాచలంను జిల్లాగా చేయడానికి అనువైనదని చెబుతున్నారు. భద్రాచలంను జిల్లాగా చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు.