కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీలే కారణం : అశ్విన్

636048912356016452ఆంటిగ్వా/వెస్టిండీస్: భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ బ్యాటింగ్ విన్యాసం ఎంత ఫేమస్ అయ్యిందో, స్పిన్నర్ అశ్విన్ సెంచరీ కూడా అంతే పాపులర్ అయ్యింది. 253 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు బాది 113 పరుగులు చేశాడు అశ్విన్. ఒక బౌలర్ సెంచరీ చేయడం చాలా అరుదు. అది కూడా భారత ఆటగాళ్లో అటువంటి ఆల్‌రౌండర్ ఉండటం టీం ఇండియాకు చాలా బలం. అంతకు ముందు కూడా ఇలాంటి శతకాలు అశ్విన్ చేశాడు కానీ ప్రస్తుతం చేసిన సెంచరీకి కారణం వివరించాడు అశ్విన్.
ఒక బౌలర్ ఎప్పుడూ లో ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేయడం కామన్. పరుగులు రాబట్టగలిగే సామర్ధ్యం ఉన్నా, అవకాశం తక్కువగా వస్తుంటుంది. అశ్విన్ విషయంలో కూడా అలానే జరిగింది. అయితే తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చి సెంచరీకి కారణమయ్యింది కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీలేనని చెప్పాడు అశ్విన్. వాళ్లిద్దరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని కూడా అన్నాడు. తనపై నమ్మకం ఉంచారని దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు.
తాను బ్యాటింగ్‌లో నిరూపించుకోవలని కోరుకుంటున్నానని అయితే అందుకు సరైన అవకాశం రావడంలేదని చెప్పాడు అశ్విన్. కానీ ఇప్పుడు 6వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సంతృప్తినిచ్చింది. మ్యాచ్‌కు ముందే కెప్టెన్ కోహ్లీ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో తనలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగిందని వివరించాడు అశ్విన్.