కోర్టు తీర్పు ప్రకారం ముందుకు సాగితేనే మేలు
అమరావతి కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
రైతుల్లో భరోసా కల్పిస్తే కలిగే ప్రయోజనాలు అధికం
మూడు రాజధానుల పల్లవిని పక్కన పెట్టడమే బెటర్
అమరావతి,మార్చి4(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు గురువారం వెలువరించిన సుదీర్ఘమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. భూ సవిూకరణలో
భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా రాజధాని నగరాన్నీ, ప్రాంతాన్నీ అభివృద్ధిచేయాలన్న హైకోర్టు ఆదేశించింది. కానీ దీనిని సానుకూల దృష్టితో చూడాలన్న ధోరణి ప్రభుత్వంలో కానరావడం లేదు. ఎందకంటే మూడురాజధానులకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ధోరణిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నిజానికి ఈ తీర్పు మేరకుముందుకు సాగితే ప్రజల్లో జగన్‌కు మంచి మైలేజీ వస్తుంది. రానున్న రెండేళ్లలో ఎంతోకొంత అభివృద్ది చేస్తే ప్రజలు కూడా అండగా ఉంటారు. పార్టీపరంగా కూడా ఇది మేలు చేస్తుంది. కానీ జగన్ ఇది ఆలోచించడం లేదన్నది బొత్స మాటలను బట్టి అర్థం అవు తోంది. దీనిని బట్టి మళ్లీ కోర్టులోనే తేª`చులకోవాలన్న ధోరణిలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ఆరునెలల్లో మాస్టర్ ప్లాన్ అమలు పూర్తిచేయాలనీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, కనీసావసరాలు తీర్చడం నెలరోజుల్లో జరగాలని న్యాయస్థానం ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరచిన ప్లాట్లు మూడునెలల్లో అప్పగించాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు ఇస్తుండాలని నిర్దేశిరచడం ద్వారా త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు ఆధారంగా ప్రభుత్వంసారుకూలంగా ముందుకు సాగడం ద్వారా అమరావతిని నిర్మించుకుని ఉంటే మంచిది లేకుంటే ప్రజల్లో మరింత అభాసుపాలుకాక తప్పదు. దాదాపు 800 రోజులకు పైగా విభిన్న రూపాల్లో ఉద్యమాలు చేస్తున్న అమరావతి రైతులకు ఇది అద్భుత విజయం, చక్కని ఉపశమనం. రైతులకు ఇచ్చిన మాటకు, చేసుకున్న ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడని కారణంగా వారికి ఆర్థికంగా, మానసికంగా ఒనగూరిన నష్టాన్ని న్యాయస్థానం సముచితరీతిలో గుర్తించడం విశేషం. అమరావతి సత్వర అభివృద్ధిని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, పిటిషనర్లకు కొంతమొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలనడం వారి ఆకాంక్షలను గౌరవించడమే. సీఆర్డీఏ చట్టం, భూసేకరణ పథకం పరిధిలోనే సమస్త వ్యవహారాలు సాగాలి తప్ప, దీనిలో పేర్కొన్నదానికి భిన్నంగా రాజధానిని మార్చడానికి కానీ, ముక్కలు చేయడానికి కానీ, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల అత్యున్నత పీఠాలను కదల్చడానికి కానీ కొత్తచట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం నిర్థారించడం విశేషం. భూ సవిూకరణ పథకం ద్వారా రైతులనుంచి తీసుకున్న భూమిని రాజధాని నగర నిర్మాణానికి తప్ప తనఖాలు పెట్టి అప్పుతెచ్చుకోవడానికి వాడవద్దన్న వ్యాఖ్య ప్రభుత్వానికి చెంపపెట్టు. న్యాయస్థానాల్లో ముప్పు ఎదురుకాక తప్పదని గ్రహించే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తాను గతంలో తెచ్చిన రద్దుచట్టాలను రద్దుచేసుకుంటూ ఇటీవల కొత్త చట్టాన్ని తెచ్చింది. మూడురాజధానుల మాటకు అంతేగట్టిగా కట్టుబడివున్నామని చెబుతూనే కోర్టు తీర్పును చులకన చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తన వికేంద్రీకరణ నిర్ణయాలన్నీ ఉపసంహరించుకొని ముందుకు సాగడం ద్వారా రైతులకు చేరువకావాలి. అమరావతి రాజధాని విషయంలో అధికారపక్షం ఇప్పటివరకూ చేసిన అడ్డగోలు వాదనలకు ఇక స్వస్తిచెప్పడం మంచింది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కోర్టు తీర్పు మేరకుముందుకు సాగాలి. విపక్షనేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సమర్థించి, అధికారంలోకి వచ్చిన తరువాత మాటామార్చిన తీరును ప్రజలు జీర్ణించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని అప్రదిష్ట పాల్జేయడానికి నైతికంగా ఎంతో దిగజారింది. భ్రమరావతి అనీ, గ్రాఫిక్స్ అనీ తీసిపారేసిన అధికారపక్ష నేతలు గత ప్రభుత్వం అక్కడ చేసిన ఖర్చుకు సంబంధించి న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను గమనించాలి. గత రెండున్నరేళ్ళుగా అమరావతిని అంగుళం కూడా ముందుకు కదలనివ్వని జగన్ ప్రభుత్వం ఇకనైనా కార్యాచరణలోకి దిగితే, ఎనిమిదేళ్ళుగా రాజధానిలేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు
ఆశలు కల్పించవచ్చు. ఇదే సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి పెంచి రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి. అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలి.