కోస్తాంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్‌ 

విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
విశాఖలోనే నిలిచిపోయిన ప్రయాణికులు
విశాఖపట్టణం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  కోస్తాఆంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్‌ తుపాన్‌ ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌, రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన విమానాలు, రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దయ్యాయి. దీంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 700 మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో ఢిల్లీ-విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయింది. చెన్నై-వైజాగ్‌ విమానం వైజాగ్‌లో ల్యాండ్‌ అవలేక తిరిగి చెన్నై వెళ్లిపోయింది. హైదరాబాద్‌- వైజాగ్‌ స్పైస్‌ జెట్‌ విమానాన్ని కూడా అధికారులు రద్దు చేశారు.  ఒకవైపు విమానాలు, మరోవైపు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వైజాగ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆహారం, తాగునీటిని రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. పెథాయ్‌ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ, గుంటూరు వెళ్లే జన్మభూమి, రత్నాచల్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. అంతేకాక విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మధ్య నడిచే మరికొన్ని ప్యాసింజర్‌ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.తుఫాను తీరం దాటిన నేపథ్యంలో తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 11 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అటు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో మెయిల్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడ వెళ్లే బస్సులను అధికారులు రద్దు చేశారు.పెథాయ్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై ¬ంమంత్రి చిన రాజప్ప అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస కేంద్రాల్లో మంచి నీరు, ఆహార పదార్దాల కొరత లేకుండా చూస్తున్నట్లు వెల్లడించారు. పెథాయ్‌ తుపాను ప్రభావం తూర్పు గోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. అమలాపురం డివిజన్‌లోని 16 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 32 మి.మి అత్యధిక వర్షపాతం ఆత్రేయపురం మండలంలో నమోదు కాగా అత్యల్పంగా అంబాజీపేట మండలంలో 16.4 శాతం నమోదైంది. అలాగే రావులపాలెంలో 22, కొత్తపేటలో 25.4 మి.మి, ముమ్మిడివరంలో 25 మి.మి, అయినవిల్లిలో 25.4 మి.మి, పి గన్నవరంలో 22.4 మి.మి, ఐ పోలవరం మండలంలో 18.4 మి.మి, మామిడికుదురులో 23.2, రాజోలులో 34.8, మలికిపురంలో 30.4, సఖినేటిపల్లిలో 27 మి.మి, అల్లవరంలో 21.08 మి.మి, ఉప్పలగుప్తంలో 20.2 మి.మి, కాట్రేనికోనలో 20.08 మి.మి వర్షపాతం నమోదైంది.
పెథాయ్‌ తుపానుపై అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా తెలిపారు. 14 మండలాల్లో 5500 మందిని సహాయక కేంద్రాలకు తరలించామని.. 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఐ.పోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో హై అలర్ట్‌ ప్రకటించినట్లు చెప్పారు.