కోహ్లిపై ధోని ప్రశంసలు

న్యూఢిల్లీ:టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై సహచర ఆటగాడు, పరిమిత ఓవర్ల సారథి మహేంద్ర సింగ్ ధోని ప్రశంసలు కురిపించాడు. అన్ని ఫార్మాట్లలోనూ విరాట్ అత్యుత్తమ కెప్టెన్ గా నిలవడానికి ఇక  ఎంతో కాలం పట్టదని కితాబిచ్చాడు. రాబోవు రోజుల్లో విరాట్ నేతృత్వంలో టీమిండియా మరింత ఉన్నతస్థితిని చేరుకుంటుందని కొనియాడాడు. ‘గత కొన్ని సంవత్సరాల నుంచి విరాట్ అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్నాడు. అసాధారణ ప్రతిభతో జట్టుకు చక్కటి విజయాలు అందిస్తున్నాడు. తొలినాళ్లలో విరాట్ ఆటకు, ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఎప్పుడూ కష్టించే తత్వంతో జట్టు గెలుపుకోసం విరాట్ చేసే కృషి నిజంగా అభినందనీయం.  విరాట్ ఎప్పుడూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడానికే ప్రయత్నిస్తాడు. ఎప్పుడూ మ్యాచ్ విన్నర్ పాత్రను పోషించాలని అనుకోవడం చిన్న విషయం కాదు. అన్ని ఫార్మాట్లలో ఒక మంచి కెప్టెన్ గా ఎదిగే లక్షణాలన్నీ విరాట్ లో ఉన్నాయి’అని ధోని పొగడ్తలతో ముంచెత్తాడు.