కోహ్లీకి విశ్రాంతినివ్వండి: మైఖేల్ వాన్
లండన్,జూలై7(జనంసాక్షి): టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్టులోనూ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ టెస్టుల్లో అతడు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో కోహ్లి ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కోహ్లి ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్
ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్ధితుల్లో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని కోహ్లిని మైఖేల్ వాన్ సూచించాడు. ’ఐపీఎల్ తర్వాత కోహ్లి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ అతడికి మరింత ఎక్కువ విశ్రాంతి అవసరం. అతడు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి, తన ఫ్యామిలీతో గడపాలని నేను భావిస్తున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు కాబట్టి తన ఫామ్‌ను తిరిగి పొందగలడు’ అని మైఖేల్ వాన్ పేర్కొన్నాడు.