క్రివిూ లేయర్‌లోనైనా.. కోటాకు అర్హులే

– సుప్రింకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఆగస్టు16(జ‌నం సాక్షి) : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో క్రివిూ లేయర్‌ విధానాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీయులు ఎవరైనా కోటా బెనిఫిట్‌ను పొందాల్సిందే అని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ముందు అటార్నీ జనరల్‌ తన అభిప్రాయాన్ని వినిపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు క్రీవిూ లేయర్‌లో ఉన్నా.. వాళ్లు కోటా లాభాలను పొందకూడదని ఎక్కడా లేదని అటార్నీ జనరల్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో కొందరు ఆర్థికంగా బలపడినా, కులం, వెనుకబాటుతనం వాళ్లను వేధిస్తూనే ఉందన్నారు. సంపన్న ఎస్సీ, ఎస్టీలపై ఎటువంటి నిర్ణయాన్నైనా రాష్ట్రపతి, పార్లమెంట్‌ తీసుకోవాలని, అది న్యాయవ్యవస్థకు సంబంధం ఉన్న అంశం కాదని అటార్నీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు వాళ్ల కులంలోని వారినే పెళ్లి చేసుకోవాలి, ఆ వర్గానికి చెందిన వారు ఉన్నత కులస్తులను చేసుకోలేరు. ఆ వర్గీయుల్లో కొందరు ఆర్థికంగా బలపడినా వాళ్లను సామాజిక రుగ్మత వేధిస్తుందని వేణుగోపాల్‌ అన్నారు. కుల వ్యవస్థలో ఉన్న లోపాలు దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు. అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో పాటు జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఇందూ మల్హోత్రాలు ఉన్నారు.